
ప్రజల ప్రాణాలతో చెలగాటం
బల్లికురవ: గ్రానైట్ లారీలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మితిమీరిన వేగం, అనుభవలేమితో ఎక్కడ ఎప్పుడు ఎలా ఢీ కొడతారోనని వాహన చోదకులు, పాదచారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ, సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లి, కొండల నుంచి స్టీల్‌గ్రే, బ్లాక్ పెరల్ గ్రానైట్ క్వారీలున్నాయి. రెండు మండలాల్లో విస్తరించి ఉన్న ఈ ఖనిజానికి అనుబంధంగా సుమారు వెయ్యి పైగా పరిశ్రమలు ఉంటాయి. గ్రానైట్ మీటరు, ముడిరాళ్లు, వృథా మెటీరియల్, పలకల వంటి ఎగుమతులను మార్టూరు, గుళ్లపల్లి, కృష్ణపట్నం పోర్టు, అనంతపురం, బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ పట్టణాలకు నిత్యం 500 పైగా లారీల ద్వారా ఎగుమతులు చేస్తుంటారు.
లైసెన్స్ లేకుండానే..
సాధారణ లారీల కంటే గ్రానైట్ లోడు విపరీతమైన బరువుతో ఉంటాయి. 90 టన్నుల నుంచి 150 టన్నుల వరకు లోడు చేసే లారీలను ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే నడపగలరు. కానీ లారీల యజమానులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బల్లికురవ, మార్టూరు రోడ్డులో ఆటోలు నడిపే వారు, పొలాల్లో ట్రాక్టర్లతో దుక్కులు దున్నే వారిని లారీ డ్రైవర్లుగా నియమిస్తున్నారు. కనీసం లైసెన్స్ అంటే ఏమిటో కూడా తెలియని వారు అధికంగా ఉన్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం ఉన్న డ్రైవర్లను రెండు మండలాల్లో వేళ్ల మీద లెక్కించవచ్చు. అందుకే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు చెల్లించకుండానే లైన్ మాముళ్లతో అనుభవంలేని డ్రైవర్లతో నెట్టుకొస్తున్నారు.
ఎటు చూసినా ధ్వంసం
ఇటీవల బల్లికురవ, ఈర్లకొండ క్వారీలనుంచి రాళ్లు ఎగుమతి చేసే లారీ డ్రైవర్ సాయంత్రం 4 గంటల సమయంలో బల్లికురవ వస్తూ వల్లాపల్లి–అంబడిపూడి గ్రామాల మధ్య మార్జిన్‌లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టాడు. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. వల్లాపల్లి సబ్‌స్టేషన్ నుంచి అంబడిపూడి, గుంటుపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరానిచ్చే మెయిన్ లైన్ కావటంతో ఆశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరి కొత్త విద్యుత్ పోల్ ఏర్పాటుతోపాటు తెగిన సప్లయ్ వైర్లు సరిచేసేందుకు 4 గంటలపాటు శ్రమించారు.
తరచూ ప్రమాదాలు
చెన్నుపల్లి అనంతవరం రోడ్డులో మల్లాయపాలెం–వేమవరం గ్రామాల మధ్య ఇటీవల అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన మేకల నాగార్జున గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తూ భోజనానికి పల్సర్ బైకుపై వెళ్తుండగా మలుపులో ఎదురుగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు, లారీ కిండ పడి నుజ్జునుజ్జు అయింది. నాగార్జున త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి గాయాలపాలై వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. నూతనంగా జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మట్టి తరలించే టిప్పర్లు సుమారు 360 పైచిలుకు తిరుగుతున్నాయి. ఇవి మితిమీరిన వేగంతో వెళ్తూ గ్రానైట్ లారీలు, టిప్పర్లు వేగానికి వాహనచోదకులు రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఓడరేవు చీరాల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో భాగంగా మట్టి తరలించే టిప్పర్లు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లకు పర్చూరు, అన్నంబోట్లవారిపాలెం ప్రాంతాల్లో నలుగురు బలయ్యారు.
తనిఖీలు ఎక్కడ?
గతేడాది కాలంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు కేసులు నమోదు చేసిన ఘటనలే లేవు. గత ప్రభుత్వ హయాంలో బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల్లో విస్తృత తనిఖీలతో డ్రైవర్ లైసెన్స్‌లేని వారికి ట్యాక్స్‌లు చెల్లించని, ధ్రువీకరణ పత్రాలు లేనివారికి అపరాధ రుసుంతో కేసులు నమోదుతో అప్పట్లో లారీ యజమానులు హెవీె లైసెన్స్ ఉన్న వారిని డ్రైవర్లుగా నియమించుకున్నారు. అనుభవంలేని డ్రైవర్లను నియమించుకోవటం వల్ల తరచూ ప్రమాదాలతోపాటు రాళ్లు దొర్లి రోడ్లపై పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
గ్రానైట్ ఎగుమతి లారీలు, టిప్పర్లకు అనుభవం లేని డ్రైవర్ల నియామకం తరచూ ప్రమాదాలు భయాందోళనలో ప్రజలు బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల్లో 860 పైగా లారీలు, టిప్పర్లు
లైసెన్స్ ఉన్న డ్రైవర్లను నియమించుకోండి
గ్రానైట్ రాళ్లు తరలించే లారీలకు అనుభవంతోపాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. అప్పుడే సురక్షితంగా గమ్యం చేరటంతోపాటు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు.
– వై.నాగరాజు, ఎస్‌ఐ

ప్రజల ప్రాణాలతో చెలగాటం

ప్రజల ప్రాణాలతో చెలగాటం