బాబూ.. కృష్ణా కరకట్టకేదీ రక్షణ? | - | Sakshi
Sakshi News home page

బాబూ.. కృష్ణా కరకట్టకేదీ రక్షణ?

Jul 13 2025 7:29 AM | Updated on Jul 13 2025 7:29 AM

బాబూ.

బాబూ.. కృష్ణా కరకట్టకేదీ రక్షణ?

హామీలివ్వడం.. ఆపై వాటి ఊసే ఎత్తకపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కృష్ణా కరకట్ట బలోపేతానికి చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేశారు. కానీ, ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా అతీగతీ లేదు. వానాకాలం వస్తున్న నేపథ్యంలో మళ్లీ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని భయపడుతున్నారు. ఇకనైనా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నారు.

రూ.222 కోట్లతో అభివృద్ధి చేసిన వైఎస్సార్‌

వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ నుంచి లంకెవాని దిబ్బ వరకు కరకట్ట అభివృద్ధితోపాటు రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.222 కోట్లు కేటాయించి, పనులు చేయించారు. ఈ పనులే నేటి వరకు రక్షణ కవచంలా కాపాడుతున్నాయి.

రేపల్లె: కృష్ణా నదీ తీరానికి రక్షణ కవచంగా నిలవాల్సిన కరకట్ట భద్రతా లోపాలతో ప్రజలను భయపెడుతోంది. పలు చోట్ల బలహీనంగా మారడం, అక్రమ పైపులైన్ల ఏర్పాటు, అధికారుల నిర్లక్ష్యం, పాలకుల హామీలను మర్చిపోవటం కలిసి ప్రజలకు ఆందోళన మిగిల్చాయి. ఓలేరు నుంచి లంకెవాని దిబ్బ వరకు 35 కిలోమీటర్ల మేర కరకట్ట పలుచోట్ల బలహీనంగా ఉంది. వరదల కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీసం చర్యలు చేపట్టకపోవడంతో తీర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరకట్టను పటిష్టం చేస్తామని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా కరకట్ట పటిష్టతకు చర్యలు చేపట్టకపోవడంతో తీర ప్రాంత వాసులు పెదవి విరుస్తున్నారు.

పైప్‌లైన్‌లతోనే పొంచి ఉన్న ప్రమాదం

నిబంధనల ప్రకారం కరకట్టకు 500 మీటర్ల దూరంలోపు ఎటువంటి చెరువుల తవ్వకాలు జరపకూడదు. పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్టకు ఆనుకొని సుమారు రెండు వేల ఎకరాలకుపైగా భూములను చెరువులుగా తవ్వి పలువురు ఆక్వా సాగు చేస్తున్నారు. వాటికి నీరు అందించడానికి పక్కనే ఉన్న బ్యాంక్‌ కెనాల్‌ నుంచి కరకట్టను తవ్వి అక్రమంగా పైపులు ఏర్పాటు చేశారు. దీనివల్ల కరకట్ట బలహీనపడి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఓలేరు వద్ద గండి పడిన సందర్భంలో లీకేజీ వద్ద నుంచే కరకట్ట కోతకు గురై కృష్ణమ్మ రేపల్లె పట్టణాన్ని ముంచెత్తింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పలుచోట్ల బలహీనంగా నది కరకట్ట వందల సంఖ్యలో అక్రమంగా పైపులైన్లు పటిష్టం చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తని సీఎం ఇకనైనా చర్యలు తీసుకోవాలంటున్న తీర ప్రాంత ప్రజలు

ప్రభుత్వానికి నివేదిక పంపాం

ఓలేరు నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్ట పటిష్టతకు సర్వే నిర్వహించాం. అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభిస్తాం. కరకట్టకు ఏర్పాటు చేసిన అక్రమ పైప్‌లైన్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేశాం.

– నాగేశ్వర నాయక్‌, కరకట్ట పర్యవేక్షణ అధికారి

గత ఏడాది తప్పిన ముప్పు

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 అక్టోబర్‌ 2న ఉగ్రరూపం దాల్చుతూ నది ప్రవహించింది. 11.38 లక్షల క్యూసెక్కులతో కడలి వైపు పరుగులు తీసింది. ఆ సమయంలో కరకట్ట పైనుంచి తాకి ప్రవహించింది. పలు ప్రదేశాలలో కట్ట బలహీనపడి నీటి లీకులు వచ్చాయి.

రేపల్లె మండలం మైనేనివారిపాలెం వద్ద అప్రమత్తమైన ప్రజలు అధికారులతో కలిసి ఇసుక బస్తాలు, బంకమట్టితో కరకట్టను పటిష్ఠం చేశారు. కనగాలవారి పాలెం, పిరాట్లంక, రాజుకాల్వ ప్రాంతాలలో బలహీనంగా ఉన్న కరకట్టను పటిష్ఠ పరిచారు.

రేపల్లె మండలం రావి అనంతవరం సమీపంలో కరకట్ట పలుచోట్ల బలహీనపడి లీకులు రావటంతో అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు ఇసుక బస్తాలు సాయంతో తాత్కాలికంగా బలోపేతం చేశారు.

బాబూ.. కృష్ణా కరకట్టకేదీ రక్షణ? 1
1/2

బాబూ.. కృష్ణా కరకట్టకేదీ రక్షణ?

బాబూ.. కృష్ణా కరకట్టకేదీ రక్షణ? 2
2/2

బాబూ.. కృష్ణా కరకట్టకేదీ రక్షణ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement