సాగునీటి కాలువల్లో అవినీతి పూడిక | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కాలువల్లో అవినీతి పూడిక

Jul 13 2025 7:29 AM | Updated on Jul 13 2025 7:29 AM

సాగునీటి కాలువల్లో అవినీతి పూడిక

సాగునీటి కాలువల్లో అవినీతి పూడిక

సాక్షి ప్రతినిధి, బాపట్ల: నగరం మండలం అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వీరాస్వామి పిల్లలు రేష్మా 13 సంవత్సరాలు (8వ తరగతి,) హారిక 11 సంవత్సరాలు (7వ తరగతి) గూడవల్లి భారతి పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో రేష్మాకు 22 సంవత్సరాలు(జాబ్‌కార్డు నంబర్‌ 100075), భారతికి 21 సంవత్సరాలు (జాబ్‌కార్డు నంబర్‌ 100076) వయస్సు వేసి జాబ్‌కార్డులు పుట్టించి మైనర్లుగా ఉన్న వారిపేరున పోస్టాఫీసులో ఖాతాలు తెరిచి కాలువ పనులు చేసినట్లు నగదును ఖాతాలకు మళ్లించారు. వీరా స్వామి తమ్ముడు కిషోర్‌ కుమార్తె లక్ష్మి మైనర్‌కాగా ఆమెకు 21 సంవత్సరాల వయస్సు చూపించి( జాబ్‌కార్డు నంబర్‌ 100079) పేరున అదే పోస్టాఫీసులో ఖాతా తెరిచి పనులు చేసినట్లు డబ్బులు డ్రా చేశారు. చరణ్‌ (జాబ్‌కార్డు నంబర్‌ 100071)అనే వ్యక్తి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి కాగా ఇక్కడ జాబ్‌కార్డు పుట్టించి నెల రోజులపాటు ఆయన ఖాతాలోకి డబ్బులు మళ్లించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క నగరం మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీలో ఫేక్‌ మస్టర్ల జాబితా చాంతాడంత. పచ్చనేతలు, సీనియర్‌ మేట్లు కలిసి ఉపాధిలో అక్రమాలకు తెగబడగా డ్వామా అధికారులు వాటాలు పుచ్చుకొని వారి అవినీతికి వెన్నుదన్నుగా నిలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

పచ్చ నేతలకు ఉపాధిగా మారింది..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో పచ్చపార్టీ నేతలు అక్రమాలకు అడ్డాగా మార్చారు. పనులు చేసిన పేదలకు సరైన కూలీ కల్పించాల్సిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు ఆ సంగతి గాలికి వదలి పనికి హాజరుకాని వారిని పనులకు వచ్చినట్లు మస్టర్‌లో చూపించి డబ్బులు కొట్టేస్తున్నారు. చేసిన పని మేరకు కొలతలు చూసి డబ్బులు ఇస్తే వాస్తవంగా పనిచేసిన కూలీలకు గిట్టుబాటు లభిస్తుంది. కానీ ఫేక్‌మస్టర్లకు డబ్బులు షేర్‌ చేస్తుండడంతో నిజంగా పనిచేసిన పేదలు నామమాత్రపు కూలీతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

అక్రమాలలో వాటాలు

ఫేక్‌ మస్టర్ల పేరుతో కొట్టేస్తున్న డబ్బులను ఫీల్డ్‌ అసిస్టెంట్లు తనకు ఉద్యోగం ఇచ్చిన పచ్చనేతతోపాటు డ్వామా అధికారులకు వాటాలు పంచుతున్నారు. వాస్తవానికి ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి కొత్తవారిని నియమించుకోవాలంటే గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం. జిల్లాలోని చాలా పంచాయతీల్లో వైఎస్సార్‌ సీపీకి చెందిన సర్పంచ్‌లు ఉండటంతో పచ్చనేతలు ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి సీనియర్‌ మేట్ల పేరుతో కొత్తవారిని నియమించుకున్నారు. ఇందుకోసం ఒక్కరి వద్ద రూ.రెండు లక్షల వరకూ వసూలు చేశారు. ఉపాధి పనుల్లో వాటాలు పంచాలని ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేరకు ఫేక్‌ మస్టర్ల డబ్బుల్లో సగం డబ్బులు స్థానిక పచ్చనేతకు చెల్లిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు మిగిలిన మొత్తంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఏపీవోలతోపాటు డ్వామా జిల్లా అధికారికి వాటాలు పంచుతున్నారు. షాట్‌ నిర్వహిస్తున్న సోషల్‌ ఆడిట్‌లో అక్రమాలు వెలుగు చూస్తున్నా ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి డ్వామా అధికారులు ఏపీడీ విచారణ అస్త్రాన్ని ప్రయోగించి అక్రమాలను కప్పిపుచ్చుతున్నట్లు ఆ శాఖ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం ఒక్కొక్క సోషల్‌ ఆడిట్‌కు జిల్లా అధికారులు రూ.లక్షకు తగ్గకుండా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

వేసవిలో రూ.కోట్లాది నిధులతో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కృష్ణా, నాగార్జునసాగర్‌ కాలువల పరిధిలో ఇటీవల పూడికతీత పనులు చేసినట్లు హడావుడి చేశారు. మరోవైపు కాలువలకు నీటి విడుదల మొదలైంది. ఏడాది తర్వాత జరిగే సోషల్‌ ఆడిట్‌ నాటికి కాలువ పూడికతీత పనులు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు కనిపించవు. ఇదే అవకాశంగా పచ్చనేతలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, డ్వామా అధికారులు కలిసి ఆధునికీకరణ పనుల పేరుతో కోట్లాది రూపాయల నిధులు బొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ జరిపితే అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement