
తమిళనాట కరూర్‌లోని వేలుసామిపురంలో హీరో విజయ్ రాజకీయ ర్యాలీలో విషాద ఘటన జరిగి నాలుగు రోజులు గడిచాయి కానీ, దానిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రం సమీప భవిష్యత్తులో సమసిపోయేలా లేవు. విజయ్ కొత్త రాజ కీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేతలపై వరుస ఎఫ్.ఐ.ఆర్.లు, రకరకాల కోర్టు కేసులు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జ్యుడిషియల్ కమిషన్, బాధితులకు అండ పేరిట వివిధ రాజకీయ పార్టీల సందర్శనలు, కేంద్రంలోని పాలక ఎన్డీఏ కూటమి పక్షాన నటి హేమమాలిని సారథ్యంలో 8 మంది ఎంపీల బృందం క్షేత్రస్థాయి పర్యటన... ఇలా ఆగకుండా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
విజయ్‌పై చెప్పులు విసరడం దగ్గర నుంచి ర్యాలీ వేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం దాకా అనేక అంశాలు, కుట్ర ఉందనే అభియోగాలు ఒక్కొక్కటిగా వస్తు న్నాయి. దుర్ఘటనపై సీబీఐ విచారణ జరపాలని విజయ్ కోరు తుంటే, సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాత విచారణ కావాలని ఎన్డీఏ డిమాండ్ చేస్తోంది.
మామూలుగా సినీ స్టార్ వస్తున్నారంటేనే భారీ జన సందోహం ఉంటుంది. ఇప్పుడు విజయ్ ఓ రాజకీయ నేత కూడా! త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజకీయపార్టీ, దాని అధినేత సభలు పెట్టడం సహజం. దానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, దాని చెప్పు చేతల్లోని పోలీసు యంత్రాంగానిది. అందులోనూ వారాంతంలో రోడ్ షో అంటే, అభిమాన నాయకుణ్ణి చూసేందుకు పిల్లా పాపలతో సహా జనం మరింతగా తరలి వస్తారు.
అంత పెద్దయెత్తున జనం వస్తుంటే, కచ్చితంగా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు అవసరం. క్రేజున్న విజయ్ సభలకు మద్రాసు హైకోర్ట్ అందుకు కొన్ని నిబంధనలు పెట్టింది. అవన్నీ తు.చ. తప్పక పాటించాల్సిందే! అదే సమయంలో కరూర్ ఘటనలో ప్రభుత్వ, పాలనా యంత్రాంగాల ఘోర వైఫల్యాలను విస్మరించలేం. అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి అత్యవసర రక్షణ వరకు అన్నీ చూసుకోవాల్సిన పోలీసు, ప్రభుత్వ యంత్రాంగాలు ఆ బాధ్యతల నుంచి తప్పించుకొని, సభ పెట్టిన వారిదే తప్పంటూ నెపం నెట్టివేయాలని చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుట్ర ఉందనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అదే నిజమైతే, అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు.
నిజానికి, మరో సినీ హీరో స్వర్గీయ విజయ్‌కాంత్ ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం తన డీఎండీకె పార్టీతో మెరుపులు మెరిపించి నప్పటికీ, తమిళనాట రాజకీయాలంటే ప్రధానంగా రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకె, అన్నా డీఎంకెల మధ్యనే నడుస్తుంటాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలది సహాయ పాత్రే. సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే, అలాగే పీఎంకే లాంటి ఇతర పార్టీలది మరీ చిన్న పాత్ర. అలాంటì ద్రవిడ రాజకీయాల తమిళనాట ‘ఇళయ దళపతి’ (యువ దళపతి) విజయ్ పార్టీ పెట్టడం కుదుపు తెచ్చింది. రాజకీయ రంగప్రవేశంపై సుదీర్ఘ కాలం దోబూచులాడిన సూపర్‌స్టార్ రజనీకాంత్ మిడిల్‌డ్రాప్‌తో ఖాళీగా ఉన్న స్థానంలోకి దూసుకువచ్చారీ ఇళయ దళపతి.
విజయ్ ఇప్పటికే తమిళనాట రెండు రాష్ట్ర స్థాయి మహా సభలు పెట్టారు. రెండు వీకెండ్ రోడ్ షోలూ చేశారు. ఎక్కడకు వెళ్ళినా జనసందోహమే! గతంలో అన్నా డీఎంకె సంస్థాపకుడైన సినీ హీరో ఎమ్జీఆర్ కాలంలో లాగా ఇప్పుడు విజయ్ సభలకు అభిమాన గణం వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా పాతికేళ్ళ లోపు యువతీ యువకులు తమ అభిమాన హీరోను దగ్గర నుంచి చూడాలని ఉరకలెత్తుతున్నారు.
ఫలితంగా, విజయ్ ఇటు పాలక డీఎంకెను కలవరపరచడమే కాక, అటు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో గద్దెనెక్కాలని ఆశలు పెట్టుకున్న ప్రతిపక్షం అన్నాడీఎంకె వ్యూహానికీ పెను సవాలయ్యారు. అలాంటి వేళ సెప్టెంబర్ 27న కరూర్‌లో వీకెండ్ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాట అనూహ్యంగా బ్రేకులు వేసింది.
కుంభమేళా తొక్కిసలాట ఘటన లాంటివన్నీ ఇటీవలి చేదు జ్ఞాపకాలే. అయితే, 41 మంది దుర్మరణానికీ, పదులసంఖ్యలో క్షతగాత్రులకూ కారణమైన కరూర్ ఘటన తమిళ రాజకీయ సభలలో కనీవినీ ఎరుగనిది. ఆ దుర్ఘటనతో మ్రాన్పడిపోయిన విజయ్ తక్షణమే 2 ఎయిర్‌పోర్టుల వద్దా మీడియాతో మాట్లా డకున్నా, తర్వాత సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల వంతున నష్టపరిహారం చెల్లించారు.
పరామర్శకు ఆయన వెళ్ళాలను కున్నా, పరిస్థితి సద్దుమణగకుండా రావద్దన్న ప్రభుత్వసూచనను మన్నించక తప్పలేదు. రెండు వారాల పాటు రోడ్ షోలనూ వాయిదా వేసుకున్నారు. ర్యాలీ నిర్వహించిన రాజకీయ పార్టీ నైతిక బాధ్యతను ఎవరూ కాదనలేరు. కానీ, కరూర్ ఘటన మొత్తానికీ విజయ్‌నే దోషిని చేస్తూ, కొందరు ప్రత్యక్షంగానూ, మరికొందరు పరోక్షంగానూ వ్యాఖ్యలు చేయడమే విడ్డూరం.
ఒకవేళ సభా నిర్వాహకులు నియమాలను పాటించడం లేదనుకుంటే, స్పష్టమైన రుజువులు చూపి, వారిని వారించాలి. అంతే కానీ, జరగకూడనిది జరిగాక తప్పంతా వాళ్ళదే అంటే ఒప్పదు. ‘‘పోలీసులు పూర్తిస్థాయిలో భద్రత కల్పించి ఉంటే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకుని ఉండేవి కావు. ఇకనైనా పోలీసులు అధికార పక్షానికి ఓ న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అన్నట్టు వ్యవహరించకుండా ఉంటే మంచిది’’ అని ప్రధాన ప్రతిపక్షమే వ్యాఖ్యానించడం గమనార్హం.
రాజకీయ ఆరోపణలు చేయాలే తప్ప తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే క్రేజున్న విజయ్‌ను ప్రత్యక్షంగా బాధ్యుణ్ణి చేస్తే, ఆయ నను వేధిస్తున్నారన్న భావన జనంలో కలిగి అది తమకే ఎదురు కొడుతుందన్న ఎరుక పాలక పక్షానికీ లేకపోలేదు. అందుకే, పార్టీలన్నీ తమ స్వార్థప్రయోజనాలకు తగ్గ ప్రకటనలిస్తూ, ప్రజల్లో మార్కులు కొట్టేసే పనిలో తలమునకలయ్యాయి. ఏమైనా, రాజ కీయ ర్యాలీలలో భద్రతా ప్రమాణాలు కీలకమనీ, జవాబుదారీ తనం అత్యవసరమనీ కరూర్ దుర్ఘటన మరోసారి గుర్తు చేసింది. అందుకు, పాలకులే ప్రధాన బాధ్యత తీసుకోక తప్పదు.
– ఆర్. పర్వతవర్ధని ‘ కోయంబత్తూరు