మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకారం..
పేదవాడికి రైలు ప్రయాణం దూరం!
ఎంపీల దృష్టికి తీసుకెళ్తాం!
రాజంపేట: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రైల్వే శాఖను లాభాపేక్ష వైపు నడిపిస్తూ.. పేద, మధ్యతరగతి ప్రయాణికులకు రైలు ప్రయాణాన్ని నరకప్రాయం చేస్తోంది. ఇప్పుడు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఫార్మేషన్‌లో ఎటు చూసినా ఏసీ, స్లీపర్ కోచ్‌లే అధికంగా దర్శనమిస్తున్నాయి. లోకో ఇంజిన్ నుంచి అటు గార్డ్ బ్రేక్ వరకు త్రీటైర్ ఏసీ, వివిధ శ్రేణుల ఏసీ కోచ్‌లతోనే రైళ్లను నింపేస్తున్నారు. కానీ, సామాన్యుడు ఎక్కే జనరల్ బోగీలు మాత్రం ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటున్నాయి. వాటిలోనూ మహిళల కోచ్ (లేడీస్ బోగీ) పోగా.. మిగిలిన సాధారణ ప్రయాణికులు రైలు ఎక్కాలంటే ప్లాట్‌ఫామ్‌పై ఊపిరిసెలవకుండా ఉరుకులు, పరుగులు తీయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎంతోమంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నా రైల్వే బోర్డులో కదలిక లేదు.
కడపకు వచ్చేసరికి
కాలు మోపే స్థలమే లేదు
కడప జిల్లా మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్, దూర ప్రాంత రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను వీలైనంత వరకు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. అసలు రైళ్లలో జనరల్ బోగీలు ఉన్నాయా లేదా అనే అనుమానం సామాన్య ప్రయాణికులకు కలుగుతోంది. రైలు బయలుదేరే ప్రారంభ స్టేషన్ (స్టార్టింగ్ పాయింట్) నుంచే జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా రైలు కడప జిల్లా పరిధిలోకి వచ్చేసరికి ఆ బోగీలలో కాలు పెట్టేందుకు కూడా వీల్లేని దారుణమైన దుస్థితి నెలకొంటోంది. ప్లాట్‌ఫామ్‌పై జనరల్ బోగీ ఎక్కడ వస్తుందో తెలియక, దాని జాడ కనుక్కోలేక పేద ప్రయాణికులు సామాన్లతో ఊరుకులు, పరుగులు తీయాల్సి వస్తోంది.
ఇసుక వేస్తే రాలనంతగా ప్రయాణికులు ఉండటంతో చాలామంది డోర్ల వద్ద వేలాడుతూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ‘డోర్ జర్నీ’ చేస్తున్నారు.
నాటి ‘నందలూరు’ వైభవం ఏది?
ముంబై–చైన్నె రైలు మార్గంలో అత్యంత కీలకమైన సెంటర్ పాయింట్‌గా ‘నందలూరు’ రైల్వే కేంద్రాన్ని అటు బ్రిటిష్ పాలకులు నాడే గుర్తించారు. ఇక్కడ రైళ్లకు నీటిని నింపే (వాటరింగ్) సౌకర్యాన్ని పునరుద్ధరిస్తే ప్రయాణికుల నీటి కష్టాలు పూర్తిగా తీరుతాయని క్షేత్రస్థాయి రైల్వే వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. చైన్నె–ముంబై మధ్య నడిచే 22157/ 22158, 22159/22160, 12163/12164 వంటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఈ మార్గంలో నడిచే అన్ని రైళ్లను నందలూరు స్టేషన్‌లో కనీసం 15 నిమిషాల పాటు ఆపి నీళ్లు నింపితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుతం చైన్నె, ముంబై, తిరుపతి, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, హుబ్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోని జనరల్ బోగీలలో నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు తీవ్ర దుర్వాసన వెదజల్లేలా కంపుకొడుతున్నాయి. మార్గమధ్యంలో వాటరింగ్ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
రైల్వే కార్పొరేట్ మాయ..
పేదవాడికి దక్కని ‘సాధారణ’ బోగీ!
ఇంజిన్ వెనుక ఒకటి..
గార్డు ముందు ఒకటి.. ఎటు చూసినా ఏసీ, స్లీపర్‌ల హడావుడి!
రైలెక్కితే ‘డోర్ జర్నీ’ ప్రాణాంతకం..
ఇసుక వేస్తే రాలనంత రద్దీతో
నరకయాతన
నీరుండదు.. క్లీనింగ్ ఉండదు..
ప్రధాన రైళ్లలో కంపుకొడుతున్న మరుగుదొడ్లు
రైళ్లలో జనరల్ బోగీల కొరతపై ఇటీవల తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి లోక్‌సభలో గళమెత్తారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా స్పందిస్తూ.. గత మూడేళ్లుగా రిజర్వేషన్ లేని సాధారణ ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని స్వయంగా అంగీకరించారు. రద్దీ పెరుగుతోందని రికార్డుల సాక్షిగా ఒప్పుకున్న కేంద్రం మరి వందేభారత్ లాంటి ఖరీదైన రైళ్లను తీసుకురావడానికే ప్రాధాన్యత ఇస్తూ, సామాన్యుడి రైళ్లపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని మేధావి వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికై నా రైల్వే శాఖ కేవలం కార్పొరేట్ హంగులకే పరిమితం కాకుండా, ప్రతీ ఎక్స్‌ప్రెస్ రైలులో సాధారణ బోగీల సంఖ్యను తక్షణమే పెంచాలని డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతోంది.
వైఎస్సార్ జిల్లా మీదుగా చైన్నెకి నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పేదవాడు ఎక్కేందుకు సరిపడా జనరల్ బోగీలు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లా మీదుగా వెళ్లే అన్ని రైళ్లకు నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో మరుగుదొడ్లు తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ జనరల్ బోగీలను పెంచడం కంటే వందేభారత్ లాంటి ఖరీదైన ప్రయాణాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది. దీనివల్ల రానురాను పేదవాడికి రైలు ప్రయాణం దూరమవుతోంది. చాలీచాలని బోగీలతో పేద, మధ్యతరగతి ప్రయాణికుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. సామాన్యుల ఇబ్బందులు తీరాలంటే ప్రతి రైలులో సాధారణ బోగీల సంఖ్యను ఇంజిన్ ముందు 3, వెనుక 3 చొప్పున (మొత్తం 6) పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– జె. కృష్ణారావు యాదవ్, వైఎస్సార్‌సీపీ రాజంపేట పట్టణ కన్వీనర్.
కడప జిల్లా మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్, దూర ప్రాంత రైళ్లలో జనరల్ బోగీలను వీలైనంత వరకు పెంచేలా రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. రైలు స్టార్టింగ్ నుంచే బోగీలు కిక్కిరిసిపోవడం వల్ల మన జిల్లాకు వచ్చేసరికి కాలు పెట్టే పరిస్థితి ఉండటం లేదు. అలాగే నందలూరులో వాటరింగ్ సౌకర్యం తక్షణమే ఏర్పాటు చేయాలి. దీనివల్ల చైన్నె, ముంబై, తిరుపతి, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, హుబ్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నీటి సమస్య తీరుతుంది. ఈ తీవ్రమైన సమస్యలపై ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, పీవీ మిథున్ రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి రైల్వే బోర్డుపై ఒత్తిడి తెస్తాము. – తల్లెం భరత్ కుమార్ రెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు.


