● గతనెల 29న మైనింగ్ జరగదని ప్రకటించిన ఎమ్మెల్యే కిశోర్
● మల్లయ్యకొండ మైనింగ్‌పై
లోకేష్, చంద్రబాబు మౌనం
● భక్తుల్లో పెరుగుతున్న ఆందోళన
సాక్షి, మదనపల్లె: మల్లయ్యకొండపై మైనింగ్ జరగదు, భక్తుల విశ్వాసాలు, మనోభావాలను గౌరవిస్తున్నాం..అందుకనే చంద్రబాబు, లోకేష్‌లు తమ మాటగా ప్రకటించాలని ఆదేశించగా ఈ ప్రకటన చేస్తున్నట్టు పీలేరు ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి మల్లయ్యకొండపై మల్లికార్జునస్వామి సాక్షిగా ప్రకటించారు. ఇది మల్లయ్య విన్నాడు, అయితే చంద్రన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని మల్లయ్య చూస్తున్నాడు. మైనింగ్‌పై మాట నిలబెట్టుకుంటారో లేదో అని భక్తులూ ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మాటలకు, చేతలకు సంబంధమే ఉండదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండ మైనింగ్ విషయంలో స్పష్టంగా రుజువైంది. భక్తుల మనోభావాలు, విశ్వాసాలతో ముడిపడిన మల్లయ్య కొండల్లో మైనింగ్ పై చంద్రబాబు జీవోలు జారీచేసి..ఇప్పుడు మౌనం దాల్చారు..
● 2011 ఫిబ్రవరి 12న కురబలకోట మండలం అంగళ్లు పర్యటనలో ప్రతిపక్షనేతగా చంద్రబాబు మల్లయ్య కొండ మైనింగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మల్లయ్యకొండ జోలికి వస్తే శివుడు తాండవం చేస్తాడు.. ఏ ప్రభుత్వమైనా మాడి మసైపోతుంది.. మైనింగ్ కోసం కొండల్లోకి ఎవరు వచ్చినా తరిమి కొట్టండి అని చంద్రబాబు మల్లయ్య కొండపై తనకు భక్తి ఉందని ఇలా ప్రకటించుకున్నారు.
● తాజాగా సీఎం హోదాలో చంద్రబాబు ఆనాడు అన్న మాటలను తీసి గట్టుమీద పెట్టారు. భక్తుల మనోభావాలు, విశ్వాసాలను ఏమాత్రం పట్టించుకోకుండా మైనింగ్ కోసం ఉత్తర్వులు జారీ చేశారు. 2026 మార్చి 30న శివపురంలో 626 హెక్టార్లు, 2026 ఏప్రిల్ 14న సాదుకొండలో 900 హెక్టార్లకు, 2026 జూన్ 23న ఎర్రకొండలో 300 హెకార్లకు మైనింగ్ అనుమతులు ఇస్తూ జీవోలు జారీ చేశారు.
మల్లయ్య కొండల్లో మైనింగ్ కోసం ఏపీఎండీసీకి, మరో ప్రైవేట్ సంస్థకు చంద్రబాబు సర్కార్ కాంపోజిట్ లైసెన్స్ అనుమతులు ఇచ్చారు. ఈ సంస్థలు కొండల్లో ఖనిజాల అన్వేషణ కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే భక్తులు ఎదురు తిరిగారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వే కానీ, మైనింగ్ అనుమతించమని తెగేసి చెప్పారు. దీంతో అధికారులు కొండల్లోకి వెళ్లేదుకు సాహసించలేదు. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జూన్ 29న పౌర్ణమి సందర్భంగా మల్లికార్జున స్వామి భక్తులు వందలాది వాహనాల్లో మహా గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంతో టీడీపీ నేతల్లో అలజడి మొదలైంది. పార్టీ, తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్న ఆందోళనతో ఉండగా ఈ విషయం చంద్రబాబు, లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో మైనింగ్ పై అప్పటి పరిణామాలతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
మైనింగ్ జరగదని లోకేష్ కబురు
జూన్ 29న జరిగిన మహా గిరి ప్రదక్షిణతో భక్తులు భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారన్న సంకేతాలతో అదే రోజు పీలేరు, మదనపల్లె ఎమ్మెల్యేలు కిశోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మల్లయ్య కొండ చేరుకున్నారు. అలయం వద్ద కిశోర్ మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ వారి మాటగా నా ద్వారా కబురు పంపించారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మల్లయ్య కొండల్లో మైనింగ్ జరగదని, ఇక్కడి భక్తులకు తెలియజేయాలని వారు కోరిన మీదట..వారి తరఫున ఈ ప్రకటన చేస్తున్నట్టు మల్లయ్యకొండపై ఆలయం సాక్షిగా పేర్కొన్నారు. ఈ ప్రకటనతో భక్తుల్లో కొంత ఊరట కనిపించింది. అయితే వాస్తవానికి తదుపరి చర్యలు చేపట్టేదాకా మైనింగ్ పై భయాందోళనలు వీడటంలేదు.
రద్దు కాని జీవోలు.. కనీస ప్రకటన లేదు
చంద్రబాబు, లోకేష్ మాటగా మైనింగ్ జరగదని నోటిమాట ప్రకటన వెలువడినా నెల గడిచినా ఆచరణలో మాత్రం పురోగతి లేదు. ప్రధానంగా భక్తులు చేస్తున్నది ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెంటనే రద్దు చేయాలి. ఈ కొండల ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. అప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుందని, భక్తుల మనోభావాలకు గౌరవించినట్లు భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే నెల రోజులైనా ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు, లోకేష్ నుంచి కానీ మల్లయ్య కొండ మైనింగ్ విషయంలో ఒక ప్రకటన కూడా జారీ కాలేదు. .
● మల్లయ్య కొండల్లో మైనింగ్ జరిపేందుకే ప్రభుత్వం ముందుకు సాగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఉండగా ఇటీవల తిరుపతిలో పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ సమావేశంలో గొడవ జరిగింది. అదే రోజు చంద్రబాబు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఈ సందర్భంగా కిశోర్ కుమార్ రెడ్డి మల్లయ్య కొండలకు సంబంధించిన మైనింగ్ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకురాగా ఆయన నుంచి స్పందన లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.దీన్ని బట్టి మల్లయ్య కొండల్లో ఖనిజాల మైనింగ్ పేరుతో దోపిడీకి సిద్ధమైనట్లు అర్థమవుతోంది. చంద్రబాబు లోకేష్ మైనింగ్ జరగదని ఇచ్చిన మాటకు కట్టుబడి జీవోలు రద్దుచేసి, నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడే కాదు 2015లోనే చంద్రబాబు జియో మైసూర్ సంస్థకు జీ హుజూర్ అన్నారు. 2011లో మైనింగ్‌ను వ్యతిరేకించిన ఆయన 2014లో అధికారంలోకి రాగానే మల్లయ్య కొండల్లో మైనింగ్ కోసం జియో మైసూర్ సంస్థకు 2015ఆగస్తు ఐదున జారీ చేసిన జీవో ద్వారా తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖనిజాన్వేషణ కోసం లైసెన్స్‌జారీ చేశారు. దీనికి మూడేళ్ల కాల పరిమితి ఇచ్చారు. అప్పట్లోనే చిత్తూరు డిఎఫ్‌ఓ ద్వారా కొండల్లోకి వెళ్ళేందుకు అనుమతులు కూడా మంజూరు చేశారు. అయితే ఆ తర్వాత భక్తుల వ్యతిరేకత కారణంగా జియో మైసూర్ సంస్థ ఇక్కడ కార్యకలాపాల నిర్వహణకు విముఖత వ్యక్తం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు ఏపిఎండీసీ, ప్రైవేటు సంస్థలకు కాంపోజిట్ లైసెన్స్‌లు కట్టబెట్టారు.


