రాజకీయ పార్టీలతో కలెక్టర్ నిశాంత్ కుమార్
సాక్షి, మదనపల్లె: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్–2026) జాబితా శుక్రవారం ప్రచురణ జరుగుతుందని కలెక్టర్ నిశాంత్‌కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2026 జూలై 24 నాటికి 12,32,439 మంది ఓటర్ల వివరాల ధ్రువీకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వివరాల మ్యాపింగ్‌లో 10,83,736 మంది ఓటర్ల వివరాలను ధ్రువీకరించి 85.06 శాతం పురోగతి సాధించినట్లు తెలిపారు. ఇంకా మ్యాపింగ్ జరగని 35,458 మంది ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిశీలించి ఽధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. అలాగే మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, గైర్హాజరైన వారు, డూప్లికేట్ నమోదులు తదితర కారణాల ఆధారంగా 1,48,703 (12.07%) మంది ఓటర్ల పేర్లను తొలగింపునకు ప్రతిపాదించినట్లు తెలిపారు. శుక్రవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 28 నాటికి వాటిని పరిష్కార ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ముసాయిదా జాబితాను పరిశీలించి, పేరు పొరపాటున తొలగించబడినా లేదా వివరాల్లో లోపాలు ఉన్నా వెంటనే క్లెయిమ్ దాఖలు చేయాలని సూచించారు. ఓటర్ల సంఖ్య పెరిగిన ప్రాంతాల్లో 90 కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ వెంకటేశు, ఎస్‌డీసీ చంద్రశేఖర్ రెడ్డి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆ వివరాలు ఇవ్వండి
జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన చనిపోయిన, డబుల్ ఓట్లు, వలసలు, చిరునామాలేని ఓటర్ల వివరాలు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీఎస్.రెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
మౌలిక వసతులపై ప్రత్యేక చర్యలు
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్య, ఐసీడీఎస్, సాంఘిక సంక్షేమ శాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ తదితర శాఖల సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. డీఈఓ సుబ్రమణ్యం, ఏసీపీ అనురాధ, ఇంటర్మీడియట్ జిల్లా కోఆర్డినేటర్ రవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి దాసరి నాగార్జున పాల్గొన్నారు.


