– ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
పీలేరురూరల్ : బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన పీలేరు – చిత్తూరు మార్గం షఫీ ప్యారడైజ్ సమీపంలో చోటు చేసుకుంది. మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ ఆర్‌బీఐ కాలనీకి చెందిన సింహాద్రి (18), శరత్‌నాయక్ (18), సాయి (27) గాండ్లపల్లె సమీపంలోని ఓ వాటర్‌ప్లాంట్‌లో పని చేసేవారు. సోమవారం ఉదయం ముగ్గురు ఆటోలో పీలేరుకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కాణిపాకం వెళుతున్న ట్రావెల్ బస్సు ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొంది. ప్రమాదంలో సింహాద్రి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన శరత్‌నాయక్, ఆటో డ్రైవర్ సాయిని చికిత్స నిమిత్తం 108లో పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. శరత్‌నాయక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. సమాచారం అందుకున్న ఆర్‌బీఐ కాలనీ వాసులు, బంధువులు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
రామసముద్రం : రామసముద్రం మండలం బీసీ కాలనీలోని శ్రీ దుర్గలమ్మ ఆలయం వెనుక ఉన్న దయ్యాలమడుగు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రామసముద్రంలోని వాల్మీకి వీధికి చెందిన సీవీ రెడ్డిశేఖర్ (33) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో బీసీ కాలనీలోని శ్రీ దుర్గలమ్మ ఆలయం సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రెడ్డిశేఖర్ మృతితో కుటుంబీకులు విలపించారు.
ప్రమాదానికి గురైన ఆటో మృతి చెందిన సింహాద్రి


