రాత్రిళ్లు.. తోడేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

రాత్రిళ్లు.. తోడేస్తున్నారు!

Jul 27 2026 1:36 AM | Updated on Jul 27 2026 1:36 AM

రాత్రిళ్లు.. తోడేస్తున్నారు!

చెరువు మట్టి అక్రమంగా తరలింపు

వారం రోజులుగా కొనసాగుతున్న తంతు

ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం

గుర్రంకొండ : రాత్రిళ్లు జేసీబీలతో చెరువుల్లోని మట్టిని తోడేస్తున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత వారం రోజులుగా గుర్రంకొండ, ఖండ్రిగ పరిసరాల్లోని చెరువులు, కుంటల్లో వ్యాపారులు, దళారులు మట్టిని తోడేసి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా బయటి ప్రాంతాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకొంటున్నారు. ఈ విషయమై మూడు రొజుల కిందట గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు చెరువుల వద్దకు చేరుకొని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తేనే వచ్చామని లేకుంటే తమకు అభ్యంతరం లేదని సాకులు చెబుతూ చెరువుల్లో నుంచి వెళ్లిపోవాలని అభ్యర్థించడం గమనార్హం. దీంతో విరామం ఇచ్చిన దళారులు పగలు అయితే కదా ఫిర్యాదులు చేసేది అంటూ తమ కార్యకలాపాలు రాత్రికి మార్చుకొన్నారు. దీంతో రెండు రోజులుగా గుర్రంకొండ, కండ్రిగ పరిసరాల్లోని చెరువులు, కుంటల్లో లైట్లు వేసుకొని మరీ మట్టిని తోడేస్తున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేద్దామంటే అధికారులు ఎవ్వరూ అందుబాటులో ఉండడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గుర్రంకొండ, ఖండ్రిగ గ్రామాలకు ఏళ్ల తరబడి వీఆర్‌ఏలు ఒక్కరు కూడా నియమితులు కాలేదు. ఆర్వోలు, ఆర్‌ఐ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేద్దామంటే వారు స్థానికంగా నివాసం ఉండడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఓవైపు ఇసుకాసురులు, మరో వైపు మట్టి మాఫియా ఇష్టానుసారంగా చెలరేగి పోతున్నారు. వీళ్ల దోపిడికి అడ్డుఆపూ లేకుండా పోతోందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈవిషయమై తహసీల్దార్‌ ఫణీకుమార్‌ను వివరణ కోరగా ఆర్‌ఐను పంపించి మట్టిని తోడుతున్న జేసీబీలు, తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇకపై వారం రోజుల పాటు ఇద్దరు వీఆర్‌ఏలను, ఇద్దరు పోలీసులను చెరువుల వద్ద కాపాలా ఉంచుతామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement