మదనపల్లె టౌన్ : తంబళ్లపల్లె మండలం రెడ్డికోట బస్టాండ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రెడ్డికోటకు చెందిన రైతు వెంకటప్ప(75) మదనపల్లెకు రావడానికి రెడ్డికోటలోని ఆర్టీసీ బస్టాండుకు వచ్చారు. అదే సమయంలో బస్టాండుకు వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వెంకటప్ప పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయనకు రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో గుర్రంకొండ 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రున్ని చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్సల అనంతరం అతన్ని తిరుపతి రుయాకు తీసుకెళ్లాలని వైద్యులు రెఫర్ చేశారు. తంబళ్లపల్లె ఎస్‌ఐ అనీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టిప్పర్ ఢీకొని రైతుకు గాయాలు
మదనపల్లె టౌన్ : టిప్పర్ ఢీకొని రైతు తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గందోళ్లపల్లికి చెందిన రైతు లక్ష్మినారాయణ(56) బైక్‌పై వస్తుండగా గుమ్మసముద్రం వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని 108లో వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్ల సలహా మేరకు బెంగళూరుకి తరలించారు. బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


