రాయచోటి : 2026–28 విద్యా సంవత్సరానికి డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం రాయచోటి డైట్‌లో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌కు 51 మంది అభ్యర్థులు హాజరైనట్లు డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. డైట్‌లో తెలుగు మాధ్యమంలో 50 సీట్లకు గాను 17 మంది, ఆంగ్ల మాధ్యమంలో 50 సీట్లకు గాను 9 మంది, ఉర్దూ మాధ్యమంలో 50 సీట్లకు గాను 16 మంది అభ్యర్థులు ప్రవేశం పొందారన్నారు. అలాగే బద్వేల్‌లోని ఎస్‌వీసీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్‌లో ఆంగ్ల మాధ్యమం 50 సీట్లకు గాను 9 మంది అభ్యర్థులు ప్రవేశం పొందినట్లు తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల 29 వరకు నిర్వహిస్తామన్నారు. అర్హత కలిగిన వారు నిర్ణీత గడువులోగా హాజరై ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలన్నారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు ప్రవేశపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకులు వెంకటసుబ్బారెడ్డి, శివప్రసాద్, గిరిబాబుయాదవ్, కేదార్‌నాథ్, వైసి రెడ్డప్పరెడ్డి, మోహన్‌నాయక్, కార్యాలయ సిబ్బంది జగదీష్, తిరుమలరావు, రవికిరణ్, వెంకటేష్, అనర్, శ్వేత తదితరులు పాల్గొన్నారు.


