తుపాకులతో బెదిరించి ఏటీఎం అపహరణ | - | Sakshi
Sakshi News home page

తుపాకులతో బెదిరించి ఏటీఎం అపహరణ

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

సినీ ఫక్కీలో రెండే నిమిషాల్లో చోరీ

స్థానికులు చూస్తుండగా

ఏటీఎం ఎత్తుకెళ్లిన దుండగులు

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శనివారం వేకువజామున సినీ ఫక్కీలో రెండే నిమిషాల్లో ఏటీఎం చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మదనపల్లె పట్టణం, శివాజీనగర్‌ లోని ఏటీఎం కేంద్రంలోకి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం వేకువజామున ప్రవేశించారు. ఏటీఎం యంత్రాన్ని బొలెరో వాహనంలో ఎక్కిస్తుండగా అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులను తుపాకులతో బెదిరించారు.

రెండే నిమిషాల్లో చోరీ

దొంగలు ఏటీఎం యంత్రాన్ని రెండే నిమిషాల్లో ఎత్తుకెళ్లారు. ఎవరైనా బయటకు వస్తే కాల్చేస్తామని బైక్‌పై ఉన్న ఇద్దరు దొంగలు తుపాకులు చూపించి స్థానికులను భయపెట్టి ఓ పథకం ప్రకారం ఎస్‌బీఐ ఏటీఎం యంత్రాన్ని అపహరించారు. ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాలతో టూ టౌన్‌, వన్‌ టౌన్‌, తాలూకా, క్రైం బ్రాంచ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. చోరీ ఎలా జరిగిందని స్థానికులను విచారించి దొంగల వాహనాన్ని పట్టుకునేందుకు వెంబడించారు. దొంగల దగ్గర తుపాకులు ఉన్నాయని స్థానికులు పోలీసులు చెప్పారు.

సునాయాసంగా తప్పించుకున్న దుండగులు

పోలీసులు ఘటనాస్థలనికి చేరుకునే సమయంలోనే దొంగలు సునాయాసంగా తప్పించుకుని వాల్మీకిపురం మీదుగా నిమ్మనపల్లె మండలంలోని అగ్రహారం వద్ద ఉండే నూరుకుప్పల కొండ వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్లతో ఏటీఎంను ముక్కలు చేసి అందులోని నగదుతో పరారయ్యారు.

డ్రోన్‌ కెమెరాలతో గాలింపు

దొంగల వాహనం నిమ్మనపల్లి మండలానికి చేరుకున్నట్లు తెలుసుకుని డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. ఎస్పీ ధీరజ్‌, అడిషనల్‌ ఎస్పీ వేంకటాద్రి నిమ్మనపల్లి వద్ద దొంగలు పగలగొట్టిన ఏటీఎంను పరిశీలించారు. దొంగలు జిల్లా సరిహద్దులు దాటి పారిపోకుండా ఉండేందుకు అన్ని చెక్‌ పోస్టులు, రహదారులపై నాకాబందీ ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హర్యానాకు చెందిన గ్యాంగ్‌ చోరీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు వినియోగించిన బొలెరో వాహనం కూడా చోరీ చేసిన కేసులోనిదేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆయుధాలతో దోపిడీకి పాల్పడిన ఘటనతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అలజడి

మదనపల్లెలో ఏటీఎం యంత్రం చోరీ రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించింది. చోరీ వెనుక విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దొంగల ముఠా ఏటీఎంను ఎత్తుకెళ్లే సమయంలో అందులో రూ.13.05 లక్షల నగదు ఉన్నట్లు ఏటీఎంల అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ మురళీకష్ణ, ఎస్బిఐ చీఫ్‌ మేనేజర్‌ సుగుణకుమార్‌ మీడియాకు తెలిపారు. సిఎంఎస్‌ ఏజెన్సీ శుక్రవారం ఏటీఎంలో రూ. 13.05 లక్షల నగదును లోడింగ్‌ చేసిందని, లోడింగ్‌ చేసిన డబ్బు మొత్తం దొంగలు ఎత్తుకెళ్లారని స్పష్టం చేశారు. ఏటీఎంను ఎత్తుకెళ్లిన వాహనంతో పాటు నిందితులు నూరుకుప్పలకొండ పరిసరాలలోనే నక్కి ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం స్పెషల్‌ పార్టీ పోలీసులు ఎస్టిఎఫ్‌ బలగాలను రంగంలోకి దింపారు. అగ్రహారం పరిసరాలలోని తోటలు, నూరుకుప్పలకొండ వద్ద ఉన్న మామిడి తోటల్లో ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఆధారాలు సేకరించిన క్లూస్‌ టీం

మదనపల్లి సీటిఎం రోడ్డులో దొంగలు చోరీ చేసిన ఎస్బిఐ ఎటిఎంను సిఆర్‌ఎస్‌ ఏజన్సీ ఎనిమిదేళ్లుగా నడుపుతున్నారు. చోరీ జరిన గదిలో క్లూస్‌ టీం ఆధారాలు సేకరించారు. అలాగే పరిసరాలలో సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలోని పోలీసు యంత్రాంగం మొత్తం దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిమ్మనపల్లి నూరుకుప్పలకొండ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ధీరజ్‌, అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితులను పట్టుకునేందుకు 28 పోలీస్‌స్టేషన్ల సీఐ, ఎస్‌ఐలతో పాటు ప్రత్యేక బందాలు ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టి గాలిస్తున్నాయి.

సవాల్‌గా మారిన ఏటీఎం చోరీ

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె దొంగలు ఏటిఎంను సునాయాసంగా దొంగిలించి డబ్బుతో పారిపోవడం జిల్లా ఎస్పీకి సవాలుగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో నక్కదిన్నె వద్ద ఏటీఎంను కట్టర్‌తో ధ్వంసం చేసిన కేసులోనే పోలీసులు కేసును ఛేదించలేకపోయారు. ఏది ఏమైనా జిల్లా ఎస్పీకి మదనపల్లె ఏటిఎం చోరీ సవాలుగా మారనుందని చర్చ సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement