సాక్షి, మదనపల్లె: మదనపల్లె టమాటా మార్కెట్లో ధరలు పతనమైతే చూస్తూ ఏం చేస్తున్నారని మార్కెటింగ్ శాఖ ఏడీ త్యాగరాజుపై మార్కెటింగ్ శాఖ కమిషనర్, డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాక్షిలో ‘ఠారుమన్న టమాటా’, ‘టమాటా రేటింగ్..మార్ కటింగ్’ శీర్షికలతో సాక్షి ప్రధాన, జిల్లా సంచికల్లో కథనాలు, శుక్రవారం చేతికందిన పంట..ధర దిగజారి తంటా కథనం ప్రచురితమయ్యాయి. మదనపల్లె మార్కెట్లో ధరలు పతనమై రైతులు పడుతున్న అవస్థలను సాక్షి కళ్ల కట్టినట్టు తెలియజేసింది. కిలో ధర రూ.3 పడిపోతే దాన్ని అధిక ధరలు పలికినట్టు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలను వెలుగులోకి తెచ్చింది. స్పందించిన మార్కెటింగ్ శాఖ కమిషనర్, డైరెక్టర్, కడప ఆర్జేడీలు అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన టమాటా మార్కెట్ల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మార్కెట్లలో టమాటా ధరలపై ఆరా తీశారు. మదనపల్లెలో ధరలు ఎందుకు పడిపోయాయని ఇన్‌చార్జి కార్యదర్శి అయిన ఏడీ త్యాగరాజను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సాక్షి కథనాలపై ఏడీ తప్పదారి పట్టించే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు స్పందిస్తూ అలాగైతే వాస్తవ విషయాలను ఎందుకు దాచి పెట్టారని చీవాట్లు పెట్టారని సమాచారం. దీనికి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్టు తెలిసింది. అనంతరం మార్కెట్ల వారీగా ధరలను సమీక్షించారు.
150 టన్నుల టమాటా కొనుగోలు
టమాటా మార్కెట్లనుంచి శనివారం 150 టన్నుల టమోటా కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ కడప ఆర్జేడీ రామాంజనేయులు తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు, పుంగనూరు, సోమల, కలికిరి నుంచి 60 టన్నులు, అనంతపురం జిల్లా నుంచి 90 టన్నుల టమాటా కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. 20 మొబైల్ రైతు బజార్ల ద్వారా టమాటా విక్రయాలు చేస్తున్నామని చెప్పారు. టమాటా రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనికి సంబంధించి మార్కెట్ యార్డ్ కార్యదర్శులకు సూచనలు చేశామని తెలిపారు.
అన్నమయ్య మార్కెటింగ్ ఏడీ తీరుపై
తీవ్ర ఆగ్రహం


