రాయచోటి టౌన్: ‘నేను మరణించినా నా కళ్లు ఈ లోకాన్ని చూస్తూనే ఉండాలి’ అన్న భర్త ఆశయాన్ని నెరవేరుస్తూ ఒక భార్య తీసుకున్న నిర్ణయం అన్నమయ్య జిల్లా రాయచోటిలో అందరి హృదయాలను కదిలించింది. రాయచోటి పట్టణ పరిధిలో స్కూటర్‌పై వెళ్తున్న తిరుమల సత్యకుమార్ అనే వ్యక్తి.. అడ్డువచ్చిన ఓ వృద్ధురాలిని తప్పించబోయి రోడ్డు బారికేడ్లను ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. భర్త ఆకస్మిక మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, ఆయన ఆశయం ప్రకారం నేత్రదానం చేయాలని భార్య తిరుమల ఆశాజ్యోతి లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఆశ్రయించారు. లయన్స్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ కొత్త సుదర్శన్ తక్షణమే స్పందించి కడప ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి బృందాన్ని రప్పించి మృతుడి నుంచి నేత్రాలను సేకరించారు. ఈ నేత్రాలను చూపులేని మరో ఇద్దరికి అమర్చివారికి పునర్జన్మ ప్రసాదిస్తామని హాస్పిటల్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ కె. ప్రశాంత్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఎవరైనా మరణానంతరం నేత్రదానం చేయాలనుకుంటే 9701078269, 9848366706 నంబర్లను సంప్రదించాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోరారు. లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు హరినాథరెడ్డి, వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.


