కలసపాడు : మండలంలోని ముద్దంవారిపల్లె గ్రామానికి చెందిన సగిలిఫ్రాన్సిస్ తన కుమారుడు సగిలిసర్వేష్‌ను రాయితో తలపై కొట్టడంతో గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే సర్వేష్ కడపలోని నాగరాజు హైస్కూల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సర్వేష్ తన భార్యను కడపకు తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాలని చెప్పాడు. ఈ విషయమై తండ్రి ఫ్రాన్సిస్, సర్వేష్‌కు వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తీవ్ర రూపం దాల్చగా ఫ్రాన్సిస్ సమీపంలో ఉన్న రాయితో సర్వేష్ తలపై కొట్టడంతో అతనికి రక్తగాయాలయ్యాయి. అతను ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని అనంతరం కలసపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఫ్రాన్సిస్ తన కోడలు వేలాంగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో తండ్రీకొడుకుల మధ్య గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
విద్యార్థిని అదృశ్యం
పోరుమామిళ్ల : కాలేజీకి పోతున్నా అంటూ బుధవారం ఇంటి నుంచి వెళ్లిన తన కూతురు హరిత (17) ఇంతవరకు తిరిగి రాలేదని ఆమె తల్లి తులసి గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ హనుమంతు తెలిపారు. దీనిపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆమెను గుర్తించిన వారు తమకు తెలియజేయాలని కోరారు. తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
యువకుడి దారుణ హత్య
మైదుకూరు : మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ పరిధిలోని బోంచేనుపల్లె వద్ద యెన్నం వెంకటేశ్వర్లు అలియాస్ ఏసుబాబు అనే 19 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో హత్యకు పాల్పడిన వారు యువకుని తలపై రాళ్లతో మోదడంతో రక్తగాయాలై మృతి చెందాడు. బోంచేనుపల్లెకు చెందిన యెన్నం సుబ్బారావు, జ్యోతిల ఒక్కగానొక్క కుమారుడైన వెంకటేశ్వర్లు పదో తరగతి వరకు చదివి మానేశాడు. బేల్దారి పనులకు వెళుతుంటాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తాను వనిపెంటకు వెళుతున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. రాత్రి 10 గంటలైనా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి సుబ్బారావు వెంకటేశ్వర్లుకు ఫోన్ చేశాడు. అతని వద్ద ఉన్న రెండు ఫోన్ నంబర్లకు ఫోన్ చేయగా రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తలేదు. ఆందోళనతో చుట్టుపక్కల వాకబు చేశారు. గురువారం ఉదయం గ్రామానికి ఉత్తరం దిక్కున కిలోమీటర్ దూరంలో నివాసాలు లేని గంజికుంట జగనన్న కాలనీ ఇళ్ల మధ్య వెంకటేశ్వర్లు మృతదేహం ఉన్నట్టు తెలిసిన వారు చెప్పారు. అక్కడికి చేరుకున్న యువకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్‌ఐ కత్తి వెంకటరమణ, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుని తల్లిదండ్రులను, గ్రామస్తులను విచారించారు. యువకుని దుస్తుల్లో ఉన్న సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం వద్ద రక్తం అంటిన ఒక కొండ రాయిని, శరీరాన్ని ఈడ్చిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. వేలి ముద్రలు నిపుణులు సంఘటన స్థలంలో ఆధారాల కోసం పరిశీలించారు. ఎవరైనా ఆడ పిల్ల తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా తన కుమారుడిని హత్య చేసి ఉంటారని యువకుని తండ్రి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు దర్యాప్తు చేపట్టామని సీఐ రమణారెడ్డి తెలిపారు.
ఇటుకల ఫ్యాక్టరీ యజమాని ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం రోడ్డులో పఠాన్ నాయబ్‌రసూల్ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాయబ్‌రసూల్ కొన్నేళ్లుగా బైపాస్ రోడ్డులో సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతను అధికంగా అప్పుడు చేశాడు. డబ్బు ఇవ్వమని రుణదాతలు ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలో అతను గురువారం తన ఇటుకల ఫ్యాక్టరీ పక్కన ఉన్న గదిలోకి వెళ్లి తాడుతో ఉరేసుకున్నాడు. కూలీలు గమనించి అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. తల్లి ఫాతిమా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


