జూదస్థావరంపై దాడి | - | Sakshi
Sakshi News home page

జూదస్థావరంపై దాడి

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

చౌడేపల్లె : మండలంలోని పుదిపట్ల పంచాయతీ మిట్టూరు సమీపంలోని మంచూరుకుంట వంక వద్ద జూద స్థావరంపై గురువారం పోలీసులు దాడులు చేసి ముగ్గరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారైనట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. వారి నుంచి రూ:42,500 నగదుతో పాటు ఐదు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లను సీజ్‌ చేశామన్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మనస్తాపంతో

యువకుడు ఆత్మహత్య

సదుం : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రమోహన్‌ వివరాల ప్రకారం.. తవణంపల్లె మండలం ద్వారకాపురం ఎస్టీ కాలనీకి చెందిన సాంబయ్య (18) కూలీ పనుల కోసం సదుం మండలానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇంటిపై తీసుకున్న రుణం ఎలా తీర్చాలో తెలియక కొంతకాలంలో మనోవేదనకు గురయ్యేవారు. బూరగమంద–చీకలచేను మార్గమధ్యంలోని ఓ మామిడితోటలో బుధవారం సాయంత్రం చీరతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బంధువులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆధార్‌ కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు

మదనపల్లె టౌన్‌ : ఆధార్‌కార్డు నమోదు, అప్‌డేట్‌ సేవల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో మదనపల్లె తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని శాశ్వత ఆధార్‌ కేంద్రం వద్దకు తరలివస్తున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఆధార్‌ శాశ్వత నమోదు కేంద్రం వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. మీ సేవ కేంద్రంలో ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌, చిరునామా మార్పు, పిల్లల బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ వంటి సేవల కోసం రోజూ వందలాది మంది వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒకే కేంద్రంపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆధార్‌ సేవలకు డిమాండ్‌ పెరగడంతో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు అనవసరంగా పదేపదే రాకుండా అవసరమైన డాక్యుమెంట్లతో రావాలని సూచించారు.

దేవదాయశాఖ పరిధిలోకి రాజనాలబండ ఆలయం

చౌడేపల్లె : సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనం నుంచి దేవదాయశాఖకు బదిలీ చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయశాఖ కమీషనర్‌ కన్నబాబు ఉత్తర్వులు జారీచేశారు. ఆలయం వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా ఉండడంతోనే ఈ ఆలయాన్ని టీటీడీ నుంచి దేవాదాయశాఖకు బదలాయించినట్లు జీవోలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement