నాణ్యత పాటించకుంటే టెండర్లు రద్దు | - | Sakshi
Sakshi News home page

నాణ్యత పాటించకుంటే టెండర్లు రద్దు

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

రాయచోటి టౌన్‌ : టెండర్ల ద్వారా దక్కించుకున్న అభివృద్ధి పనులలో నాణ్యత పాటించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే టెండర్లు రద్దు చేస్తామని రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి పాలక మండలి అధ్యక్షడు తిరుమల మనోజ్‌ కుమార్‌ హెచ్చరించారు. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో పలు రకాల సేవా, సాంకేతిక అభివృద్ధి పనులకు బహిరంగ టెండర్లు నిర్వహించారు. ఈ ప్రక్రియలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుండి మొత్తం 32 మంది కాంట్రాక్టర్లు తరలివచ్చారు.

లడ్డు బాక్సులు, హై–రిజల్యూషన్‌ సీసీ కెమెరాల ఏర్పాటు!

స్వామి వారి ప్రసాద విక్రయాల కోసం ఒక లడ్డు, రెండు లడ్డూల బాక్స్‌లు, లడ్డు కవర్లు (జయో కంపెనేషపర్‌, 6X6 సైజు బటర్‌ పేపర్‌తో పాటు రెండు వైపులా ఆలయ పేరు ప్రింటింగ్‌) సరఫరాకు టెండర్లు జరిగాయి. అలాగే భక్తుల భద్రత దృష్ట్యా ఆలయంలో ప్రస్తుతం ఉన్న 42 పాత సీసీ కెమెరాల (2ఎంపీ) స్థానంలో అత్యాధునిక 5 ఎంపీ, 8 ఎంపీ ఐపీ కెమెరాలు, ఎన్‌వీఆర్‌, ఎస్‌ఎస్‌డీ హార్డ్‌ డిస్క్‌ల ఇన్‌స్టాలేషన్‌తో పాటు అదనంగా మరో 16 కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు నిర్వహించారు. ఆలయ నిబంధనల ప్రకారం అత్యంత తక్కువ ధర (ఎల్‌1) కోట్‌ చేసిన వారికే ఈ టెండర్లు ఖరారు చేస్తామని, ఎక్కడా నాణ్యత ప్రమాణాలు లోపించకుండా వస్తువులను సరఫరా చేయాలని స్పష్టం చేశారు.

శ్రావణ మాసం నాటికి వసతుల కల్పన

ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా భక్తుల తాగునీటి సమస్య నివారణకు దాతల సహకారంతో రెండు ప్రత్యేక నీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామని పాలక మండలి అధ్యక్షుడు తెలిపారు. వీటితో పాటు రూ.7 లక్షల వ్యయంతో రెండు రేకుల షెడ్‌లు, మాడవీధులలో రెండు భారీ కేడ్లను నిర్మించినట్లు వివరించారు. ఈ పనులన్నింటినీ వచ్చే శ్రావణమాసం ప్రారంభం నాటికే పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ ఇంద్ర, పాలక మండలి సభ్యులు గిరి, ఇతర సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ వీరభద్రస్వామి ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్‌ కుమార్‌

లడ్డు బాక్సులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు భారీగా తరలివచ్చిన కాంట్రాక్టర్లు

శ్రావణ మాసం నాటికి భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement