● మున్సిపల్ కమిషనర్‌ను అడ్డుకున్న రైతులు
● 500 మంది రైతులు రోడ్డున పడతారని ఆవేదన
మదనపల్లె టౌన్ : మదనపల్లె మున్సిపాలిటీకి తాగునీరు సరఫరా చేసేందుకు వేంపల్లె చెరువులో బోర్లు వేస్తే తాము నష్టపోతామని, సుమారు 500 మంది రైతులు వీధిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం వేంపల్లె చెరువు వద్దకు పరిశీలనకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ తాజ్ మన్సూర్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువులో బోర్లు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. చెరువు నీటిపై ఆధారపడి తాము వ్యవసాయం చేసుకుంటున్నామని, బోర్లు వేస్తే భూగర్భజలాలు తగ్గి పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తాలూకా పోలీసుల జోక్యం
వేంపల్లె వద్ద రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం గ్రామస్తులను పోలీస్ స్టేషన్‌న్‌కు పిలిపించి బోర్లు వేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎంపీడీవో తాజ్ మన్సూర్, సీఐ కళా వెంకటరమణ గ్రామస్తులతో మాట్లాడి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీకి తాగునీటి అవసరం, రైతుల సమస్యలపై చర్చించారు. అయితే తమ పొలాలకు నష్టం చేసే బదులు చిప్పిలి సమ్మర్ స్టోరేజీకి తీసుకున్న భూముల్లో బోర్లు వేసుకొని పట్టణంలో నెలకొన్న తాగినీటి సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా అప్పుడు స్వాధీనం చేసుకున్న బోర్లు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకొని ప్రభుత్వం తాగినీటి సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.


