మదనపల్లి (కురబలకోట): ఒకప్పుడు ఉదయం షట్టర్ ఎత్తితే చాలు కస్టమర్లతో కళకళలాడుతూ, రద్దీగా కనిపించే దుకాణాలు.. నేడు బోణీ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన దుస్థితికి చేరాయి. జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన మదనపల్లి, రాయచోటి, పీలేరు, పుంగనూరు తదితర ప్రాంతాలలో రెండేళ్లుగా వ్యాపారాలు తీవ్రంగా తగ్గుముఖం పట్టాయి. ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, కిరాణా, హోటళ్లు, ఫర్నిచర్, బంగారం, చెప్పుల షాపులతో పాటు వేలాది చిరు వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. పండగలు, నెలలో మొదటి వారంలో తప్ప మిగిలిన రోజుల్లో మార్కెట్ ఆశాజనకంగా లేద ని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వెన్నెముక విరిగిన వ్యవసాయం..
అన్నమయ్య జిల్లా ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. ముఖ్యంగా టమాటా, కూరగాయలు, మామిడి, నేరేడు వంటి పంటలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రమవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇప్పటివరకు వేరుశనగ విత్తనం వేయని ఊర్లు ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతాంగం తీవ్రంగా అప్పులపాలవుతోంది. ఎరువుల ధరలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ, ఉత్పత్తులకు మాత్రం సరైన ధర దక్కడం లేదు. రైతుల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో, వారు మార్కెట్‌లో విలాసాలకు పోకుండా కేవలం అత్యంత అవసరమైన వస్తువుల కొనుగోళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇది నేరుగా స్థానిక వ్యాపారాలను దెబ్బతీసింది.
కూటమి పాలనలో ‘కలత’!
గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద, దిగువ మధ్యతరగతి వర్గాల చేతికి సకాలంలో నగదు అందింది. కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారాలకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు, సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాయి. ఉత్పత్తులకు మంచి ధరలు లభించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి జిల్లా జీడీపీ గణనీయమైన వృద్ధి సాధించింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలు లేకపోవడం మార్కెట్‌ను దెబ్బతీసింది. మరోవైపు ఇళ్లు, వాహనాలు, విద్య, వైద్యం ఖర్చులు పెరిగాయి. వీటికి తోడు ఈఎంఐల భారం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఛార్జీల వడ్డనతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆన్‌లైన్, కార్పొరేట్ల దెబ్బ!
స్థానిక వ్యాపారాలు పడిపోవడానికి తోడు డీమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, ఈ–కామర్స్ సైట్లు విస్తరిస్తూ స్థానిక మార్కెట్లను శాసిస్తున్నాయి. ఆన్‌లైన్ సంస్థలు డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు మరియు తక్కువ ధరలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వినియోగదారులు కాలు బయట పెట్టకుండా, ఆర్డర్ బుక్ చేస్తే వస్తువులు నేరుగా ఇంటి తలుపు తట్టి డెలివరీ అయ్యే సంస్కృతి పెరిగిపోవడంతో స్థానిక చిన్న దుకాణదారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దుకాణాల బాడుగలు, కరెంట్ ఛార్జీలు కట్టడానికి దిక్కులు చూడాల్సి వస్తోందని, వేరే ప్రత్యామ్నాయ పనులు తెలియక, దశాబ్దాలుగా అలవాటైన సొంత వ్యాపారాన్ని వదల్లేక నష్టాల్లోనే కాలం వెల్లదీస్తున్నామని వ్యాపారులు కన్నీరుమున్నీరవుతున్నారు.


