గుర్రంకొండ: ఏ వ్యాపారమైనా సప్లయ్, డిమాండ్ సూత్రంపైనే నడుస్తుంది. మార్కెట్‌లో డిమాండ్ పెరిగినప్పుడు భారీగా లాభాలు గుంజేయవచ్చనే సూత్రాన్ని ఇక్కడి అక్రమార్కులు వంటబట్టించుకున్నారు. గుర్రంకొండ మండలంలో ప్రకృతి సంపదను నిలువునా కొల్లగొడుతూ, మట్టి, మొరం అక్రమ రవాణాతో లక్షలు గడిస్తున్నారు. గుట్టలు, చెరువులు కరిగిపోతున్నా.. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎండిన చెరువులే లక్ష్యంగా..
రాత్రింబవళ్లు తోడివేత!
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక, చెరువుల్లో నీరు పూర్తిగా ఇంకిపోయింది. జీవచ్ఛవంలా మారిన ఈ జలాశయాలనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మట్టి మాఫియా తమకు అనుకూలంగా మార్చుకుంది. గుర్రంకొండ, ఖండ్రిగ గ్రామాల పరిసరాల్లోని పలు గుట్టలు, చెరువుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి జేసీబీలతో రాత్రింబవళ్లు తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. వారం రోజులుగా వ్యాపారులు, దళారులు ఇదే పనిగా పెట్టుకుని గుట్టలను ధ్వంసం చేస్తుండటంతో ఇవి తమ అసలు రూపురేఖలను కోల్పోతున్నాయి.
ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల జోరు!
పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఇటుకల బట్టీల కోసం వందల లోడ్ల మట్టిని తరలిస్తూ నానా అడ్డదారులు తొక్కుతున్నారు. వీరే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ప్లాట్లను, మరికొందరు వాణిజ్య సముదాయాల ఏర్పాటు కోసం భూములను చదును చేసుకోవడానికి చెరువులను అక్రమంగా తోడేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్ల జాతర నెలకొంది. ఈ దందా అక్రమార్కులకు కాసుల వర్షంకురిపిస్తోంది.
హెచ్చరించినా బేఖాతర్.. సాగుతున్న దందా!
గుట్టలు, చెరువుల్లో అక్రమంగా మట్టి తరలించకూడదంటూ స్థానిక రెవెన్యూ అధికారులు పలుమార్లు ఆదేశాలు జారీ చేస్తున్నా రియల్ వ్యాపారులు, దళారులు అస్సలు ఖాతరు చేయడం లేదు. ఇటీవల వారం రోజుల క్రితం ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి జేసీబీ తీసుకొచ్చి ఖండ్రిగ గ్రామ పరిధిలోని ఓ గుట్టను ఇష్టానుసారంగా తవ్వేశారు. రాత్రింబవళ్లు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తరలించి తన భూమిని చదును చేసుకున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి సదరు రియల్ వ్యాపారులను మందలించినా.. వారు లెక్కచేయకుండా యథేచ్ఛగా దందాను కొనసాగించడం గమనార్హం.
కొరవడిన పర్యవేక్షణ..
అధికారుల ‘నెపాల’ పర్వం!
గ్రామాల్లో దళారులు ఇష్టానుసారంగా ప్రకృతి సంపదను దోచేస్తున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కంటిముందే ఈ అక్రమ రవాణా బహిరంగంగా సాగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలం సాగదీస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే అక్రమ మట్టి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని ప్రజలు మండిపడుతున్నారు.
గుర్రంకొండలో యథేచ్ఛగా ప్రకృతి దోపిడీ!
జేసీబీలతో ఇష్టానుసారంగా
చెరువులు, గుట్టల ధ్వంసం
అనుమతులు లేకుండానే
మట్టి, మొరం అక్రమ రవాణా
అధికారుల ఆదేశాలు బేఖాతర్
రాత్రింబవళ్లు టిప్పర్ల జాతర
చర్యలు తీసుకోకుండా కాలం సాగదీస్తున్న పోలీసులు, రెవెన్యూ విభాగం


