కడప వైఎస్‌ఆర్ సర్కిల్: అమరావతి ఇన్‌క్లూజివ్ క్రికెట్ కప్–2026 పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వైఎస్సార్ జిల్లా శారీరక దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపికలు ఈ నెల 26న కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ స్టేడియం నెట్స్‌లో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా అసోసియేషన్ కన్వీనర్ మనోహర్‌రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్‌తో పాటు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, యూడీఐడీ కార్డు జిరాక్స్ ప్రతులు మరియు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9885254432 లేదా 9160008447 నంబర్లను సంప్రదించవచ్చు.
మదనపల్లెలో
టమాట ధర పతనం
– కిలో రూ.5
సాక్షి, మదనపల్లె: దేశంలోనే అతిపెద్ద టమాట మార్కెట్ మదనపల్లెలో బుధవారం టమాట ధరలు పతనమయ్యాయి. బుధవారం కిలో టమాట రూ.5 పలికింది. అత్యధిక ధర కిలో రూ.12 పలికినప్పటికీ, ఈ గ్రేడ్ స్థాయి టమాట కొద్దిపాటిగానే ఉంటుంది. కిలో రూ.5 పలకడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విక్రయానికి 1,260 టన్నుల టమాట వచ్చింది. ఈ ధరలు మరింత పతనమై రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ధరల పతనంపై మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
వాహనం ఢీ కొని
కృష్ణజింక మృతి
ములకలచెరువు : గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో కృష్ణజింక మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఫారెస్టు బీటు అధికారి శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని కనుగొండరాయస్వామి ఆర్చి వద్ద జింకల మంద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొందన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జింక సంఘటన స్థలంలోనే మృతిచెందింది. గమనించిన ప్రయాణికులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న బీటు అధికారి జింకను స్వాధీనం చేసుకుని వెటర్నరీ డాక్టర్ వద్ద పోస్టుమార్టం నిర్వహించి కనుగొండ అడవిలో ఖననం చేశారు.
నిందితుడిపై
పోక్సో కేసు నమోదు
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని వీసీ వడ్డెపల్లెకు చెందిన 16 సంవత్సరాల మైనరు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునిపై పోక్సోకేసు నమోదు చేసినట్లు కల్లూరు సీఐ జయరామయ్య, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసు కథనం మేరకు వివరాలు... పూతలపట్టు మండలం తలపలపల్లె వడ్డిపల్లెకు చెందిన డేరంగుల రోహిత్(21) భాదిత బాలికను కొంతకాలంగా ఫోన్‌లో మాట్లాడుతూ ఆమెను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం 28.6.26న బాధితురాలి ఇష్టానికి విరుద్ధంగా ఇంటిలోకి తీసుకెళ్ళి లైంగిక దాడికిపాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జరిగిన విషయం ఎవరికై నా చెపితే చంపేస్తానని బెదిరంచడంతో ఆబాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీస్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేశామన్నారు. 24 గంటలు గడవక ముందే నిందితుడు రోహిత్‌ను పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డిగారిపల్లె క్రాస్‌వద్ద బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగిందని పోలీసులు తెలిపారు.


