మదనపల్లె టౌన్: ఎయిడ్స్ నియంత్రణ పేరుతో జిల్లాలో పనిచేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ నిధులను నిలువు దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి.
ఖాళీ బాక్సులే సాక్ష్యం.. కోట్లలో గోల్‌మాల్!
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన కండోమ్ బాక్సులు నెలల తరబడి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉచితంగా కండోమ్‌లు అందించాల్సిన బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు పూర్తిగా గాలికొదిలేశాయి. క్షేత్రస్థాయిలో బాక్సులు శిథిలావస్థకు చేరి, తుప్పుపట్టి కనిపిస్తుండటమే ఈ సంస్థల నిర్లక్ష్యానికి నిదర్శనం. గత ఐదేళ్లలో టార్గెట్ గ్రూపులకు అవగాహన, ఉచిత కండోమ్‌ల పంపిణీ, వైద్య పరీక్షల కోసం కోట్ల రూపాయల నిధులు విడుదలైనా.. క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే నిధులన్నీ అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.
కాగితాలకే పరిమితమైన కళాజాతాలు
ఎయిడ్స్‌పై గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కళాజాతాలు, వీధి నాటకాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన సంస్థలు కేవలం రికార్డులకే పరిమితమయ్యాయి. ఫ్లెక్సీలు కట్టి, ఫొటోలు తీసి నిధులు డ్రా చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాయి.
ప్రచారం సన్నగిల్లి..మహమ్మారి విజృంభణ!
అధికారుల నిర్లక్ష్యం, స్వచ్ఛంద సంస్థల మోసాలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వెరసి ఎయిడ్స్ రోగుల పాలిట శాపంగా మారింది. ఎయిడ్స్‌పై క్షేత్రస్థాయి ప్రచారం పూర్తిగా సన్నగిల్లడంతో జిల్లా వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభించి వేల మంది ఎయిడ్స్ బారిన పడ్డారని, వారిలో సగం మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారని స్థానికుల సమాచారం.
వివరాలు ఇవ్వకుండా దాటవేత!
ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల నిధులు, జిల్లాలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల వివరాలపై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రాధికను వివరణ కోరగా.. తాము ఎలాంటి వివరాలు ఇవ్వడానికి లేదని చెబుతూ విషయాన్ని దాటవేయడం గమనార్హం.
స్వచ్ఛంద సంస్థల పనితీరుపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వెంటనే జిల్లాలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల వివరాలు, వాటి కార్యకలాపాలు, ఖర్చు చేసిన నిధులపై ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కాగితాల్లోనే అవగాహన సదస్సులు
జేబుల్లోకి కోట్ల రూపాయల నిధులు
నియంత్రణ పేరుతో నిలువు దోపిడీ


