● రెతు కుటుంబంపై మూకుమ్మడి దాడి
● భూ సర్వే అడ్డుకుని
ఆపై దాడి చేసిన ప్రత్యర్థులు
మదనపల్లె టౌన్ : మండలంలోని పోతబోలు గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో రైతు కుటుంబంపై ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తాలూక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోతబోలు గ్రామం, వండాడివారిపల్లికి చెందిన కె.లక్ష్మన్న, కృష్ణయ్యలకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి కె.లక్ష్మన్న, కె.కృష్ణయ్యలు భూ సర్వే చేయించేందుకు పొలం వద్దకు వెళ్లారు. అయితే అదే ఊరికి చెందిన ప్రత్యర్థి వర్గంలోని ఎన్.శ్రీనివాసులు వర్గీయులు భూమిని సర్వే చేయనీకుండా అడ్డుకున్నారు. తమకు కోర్టు స్టే ఇచ్చినా కూడా ఎన్. శ్రీనివాసులు వర్గీయులు కావాలనే తమ భూమిపైకి వచ్చి అనుచరులతో దౌర్జన్యం చేసి కరల్రతో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. కె.లక్ష్మన్న, కృష్ణయ్య, శ్రీనివాసులు, ఈశ్వరమ్మ తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు. గాయపడ్డవారిని కుటుంబీకులు వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడుల్లో ఎన్.శ్రీనివాసులు, రాధ కూడా గాయపడ్డారని ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించామని తాలూక పోలీసులు తెలిపారు.


