మదనపల్లి (కురబలకోట) : డబ్బున్నా..ఖర్చుపెట్టలేని నిస్సహాయత.. చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతికినట్లుగా గ్రామ పంచాయతీల పరిస్థితి తయారైంది. గ్రామాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలవాల్సిన పంచాయతీలకు కూటమి ప్రభుత్వం ఆంక్షల కత్తి వేలాడదీసింది. ఇక నుంచి పంచాయతీలలో వివిధ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు, నిధుల వినియోగానికి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) అనుమతి ఆమోదం తప్పనిసరని ఇటీవల ఆంక్షలు విధించారు. దీంతో గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధులున్నా బిల్లుల ఆమోదం ఽజిల్లా పంచాయతీ అధికారికే పరిమితం చేయడంతో కార్యదర్శులు చేతులుకట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పంచాయతీలలో జరిగే వివిధ అభివృద్ధి పనులపై ప్రభావాన్ని చూపనుందని భావిస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనుల బిల్లులకై నా ఆన్‌లైన్‌లో డీపీఓ అనుమతి తప్పనిసరి చేశారు. వారు పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతే బిల్లులు మంజూరవుతాయి. జిల్లాలో 25 మండలాలు ఉన్నాయి. వీటిలో 411 పంచాయతీలు ఉన్నాయి. 342 మంది కార్యదర్శులు ఉన్నారు. ఇదివరలో సర్పంచులకు చెక్ పవర్ ఉండేది. కార్యదర్శులు బిల్లులు పరిశీలించి చెల్లింపులు చేసేవారు. వారి పదవీ కాలం ముగియడం స్పెషలాఫీసర్లు రావడంతో గ్రామంలో చేపట్టదలచిన పనులను కార్యదర్శులకు అధికారం ఉండేది. ఇప్పుడు కొత్త విధానం ద్వారా బిల్లుల చెల్లింపులకు డీపీఓ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఈ ప్రక్రియలో ఒక్కోసారి జాప్యం చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదం ఉంది. నిధుల దుర్వినియోగం అరికట్టాలని అక్రమాలకు తావుండరాదని ప్రభుత్వం కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతి పనికి కూడా జిల్లా కేంద్రంలోని పంచాయతీ అధికారి కార్యాలయం వైపు చూడాల్సి రావడం అసహనాన్ని కలిగిస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారితనం కోసం ఇలా అమలు చేస్తున్నామని చెబుతోంది. అయితే అధికారిక అనుమతులు ఆలస్యం కాగలవని అభివృద్ధి పనులు మందగించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్, వివిధ పన్నులు, ప్లాన్ అప్రూవల్ తదితర నిధులు వస్తాయి. చేతిలో నిధులున్నా ఖర్చు పెట్టలేని దుస్థితి రావడం పట్ల విచారం వ్యక్తమవుతోంది. అక్రమాలకు అడ్డుకట్టవేయడం అవసరమే కాని ఏకంగా కొత్త విధానంతో అభివృద్ధికే ఆటంకంగా పరిణమించే చర్యలకు ఉపక్రమించడం ఎంత వరకు సమంజసమన్నది ప్రశ్నగా మారింది. జిల్లా అధికారి అనుమతి తీసుకోవాలన్న నిర్ణయాన్ని పునరాలోచించాలన్న డిమాండ్ బలంగా విన్పిస్తోంది
ఖాతాల్లో నిధులున్నా.. ఖర్చు పెట్టలేని పరిస్థితి
జిల్లా పంచాయతీ అధికారికి ‘గ్రీన్ సిగ్నల్’ పవర్
కార్యదర్శుల చేతులు కట్టేసిన కూటమి ప్రభుత్వం
గ్రామాల్లో అభివృద్ధిపై ప్రభావం
అక్రమాలకు ఆస్కారం ఉండదు
వివిధ అభివృద్ధి పనుల్లో నిధులు దుర్వినియోగం, అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 30 వేల పరిమితి వరకు బిల్లులకు కార్యదర్శులకు అనుమతి కొనసాగుతుంది. అంతకంటే ఎక్కువ విలువైన బిల్లులను ఆన్‌లైన్ లాగిన్‌కు ఎంబుక్కులు, బిల్లుల వివరాలు నమోదు చేస్తారు. వాటిని సమగ్రంగా పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. పారదర్శకంగా పర్యవేక్షణ ఉంటుంది. అక్రమాలకు తావుండదు. దొంగ బిల్లులకు చెక్ పడుతుంది. –రాధమ్మ, డీపీఓ, మదనపల్లి


