గాలివీడు : గాలివీడు టౌన్ పరిధిలోని నూలివీడు రోడ్డుకు చెందిన ఈశ్వరమ్మ, ఆమె రెండున్నర సంవత్సరాల కుమారుడు రంజిత్‌కుమార్‌రెడ్డి అదృశ్యమైన ఉదంతం సుఖాంతమైంది. తల్లి, కుమారుడు క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు చేరనున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాలివీడు నూలివీడు రోడ్డుకు చెందిన ఈశ్వరమ్మ, తన కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డితో కలిసి ఈనెల 14వ తేదీన అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు 21వ తేదీ మంగళవారం కేసు నమోదు చేశారు. కేసు నమోదైన 24 గంటలలోపే కడప జిల్లా వేంపల్లెలో ఇద్దరి ఆచూకీ లభ్యమైంది. వేంపల్లెలో తల్లి, కుమారులను సురక్షితంగా గుర్తించిన పోలీసులు, వారిని వెంటనే గాలివీడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. త్వరలోనే ఎస్‌ఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వారిని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పోలీసులను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేకంగా అభినందించారు.


