పీలేరు రూరల్ : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని నింపిన పార్కు.. నేడు నిర్వహణ లోపంతో పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... దినదినాభివృద్ధి చెందుతున్న పీలేరులో ప్రజల చిరకాల వాంఛ అయిన పార్క్‌ను గత ప్రభుత్వ హయాంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కృషితో ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా పీలేరు పట్టణంలో పిల్లల ఆట విడుపు, పెద్దల విశ్రాంతికి, వాకింగ్ చేసుకోవడానికి పార్కు లేకపోవడంతో చాలా నిరుత్సాహంగా ఉండేవారు. ఇలాంటి తరుణంలో ప్రత్యేక చొరవ చూపి పార్క్ (శ్రీ కాశీవిశాలాక్షి ఉద్యానవనం) ఏర్పాటు చేశారు. పీలేరు పట్టణం నడిబొడ్డున కోటపల్లె జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఎదురుగా సర్వే నంబరు 493లో రెండెకరాల స్థలం పార్క్ కోసం కేటాయించారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో పార్క్‌కు కావాల్సిన స్థలాన్ని అభివృద్ధి చేశారు. సుమారు రూ.20 లక్షలతో ఈ స్థలంలో పెద్దలకు అనుగుణంగా వాకింగ్ ట్రాక్‌లు, విశ్రాంతి బల్లలు ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర వాతావరణం నింపడానికి వివిధ రకాల ఆకర్షణీయమైన పూల మొక్కలు, పచ్చదనం నింపేలా స్పాంజ్ గ్రాస్ ఏర్పాటు, చిన్న చిన్న ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేశారు.
వెలగని విద్యుత్ దీపాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పార్క్ నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో నిర్వీర్యం అవుతోంది. గ్రామ పంచాయతీ అధికారులు గానీ, నాయకులు గానీ పార్క్ నిర్వహణపై పూర్తిగా విస్మరించడంతో రోజురోజుకు దయనీయంగా తయారైంది. ప్రస్తుతం పార్క్‌లో గ్రాస్, మొక్కలు మొత్తం ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. పిల్లల ఆటవిడపు వస్తువులు, కూర్చుని సేద తీరే బల్లలు విరిగిపోయాయి. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు కూడా వెలగక పోవడంతో పార్క్ అంధకారంలోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం పార్క్‌లో యువకులు క్రికెట్ ఆడుకుంటూ క్రీడామైదానంగా మార్చేశారు. మరోవైపు పశువులను పార్క్‌లో మేపుతున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో పార్కు ఏర్పాటు
కూటమి పాలనలో అటకెక్కిన నిర్వహణ
పూర్తిగా ఎండిపోయిన స్పాంజ్ గ్రాస్
పీలేరు పంచాయతీ పరిధిలోని పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పంచాయతీ నిధులతో ఇద్దరు వాచ్‌మెన్లను ఏర్పాటు చేస్తాం. అలాగే పార్కులో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాం. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి పంచాయతీ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం. పశువులు లోనికి వెళ్లకుండా పార్క్‌కు ఫెన్సింగ్ వేపిస్తాం.
– బ్రహ్మానందరెడ్డి, ఈవో, పీలేరు


