వైఎస్సార్‌ కడపలో హాల్టింగ్స్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ కడపలో హాల్టింగ్స్‌

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

వైఎస్సార్‌ కడపలో హాల్టింగ్స్‌

రైలు కోచ్‌ల వివరాలు

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా వాసులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ సరికొత్త తీపి కబురు అందించింది. కడప మీదుగా బీహార్‌కు నేరుగా ప్రయాణించేందుకు వీలుగా సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక రైలుగా నడుస్తున్న తిరుపతి–రక్సల్‌ ఎక్స్‌ప్రెస్‌ను క్రమబద్ధీకరిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిని 17433/17434 నంబర్లతో రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రకటించారు. జూన్‌ 1న తిరుపతిలో ఈ రైలు అధికారికంగా ప్రారంభం కానుంది. తిరుగు ప్రయాణంలో జూన్‌ 4న రక్సల్‌లో ఈ రైలు (17434) బయలుదేరుతుంది.

అంతర్జాతీయ సరిహద్దు..

నేపాల్‌కు మార్గం సుగమం

ఈ రైలు చివరి స్టాపేజ్‌ అయిన రక్సల్‌ జంక్షన్‌ భారతదేశంలోని బీహార్‌ రాష్ట్రంలో, ఇండో–నేపాల్‌ సరిహద్దు వెంబడి ఉన్న ఒక కీలకమైన రైల్వే కేంద్రం. ఇది భారతదేశానికి, పొరుగున ఉన్న నేపాల్‌లోని ప్రముఖ పారిశ్రామిక నగరమైన ’బిరగంజ్‌’కు మధ్య వాణిజ్యం, ప్రయాణానికి ప్రధాన రవాణా కేంద్రంగా కొనసాగుతోంది. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల నేపాల్‌ వెళ్లే పర్యాటకులకు, భక్తులకు మార్గం ఎంతో సుగమం కానుంది.

జ్యోతిర్లింగ దర్శనం..

ఉత్తర భారత పట్టణాలకు అనుసంధానం

ఈ రైలు ప్రయాణం ద్వారా జార్ఖండ్‌ రాష్ట్రంలోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన ’బాబా బైద్యనాథ్‌ ధామ్‌’ (దేవ్‌ఘర్‌) సందర్శించుకునేందుకు ఉమ్మడి కడప జిల్లావాసులకు సువర్ణావకాశం లభిస్తుంది. ఈ రైలు మార్గంలో జార్ఖండ్‌ రాజధాని రాంచీ, ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌తో పాటు దుర్గ్‌, గోండియా, బిలాస్‌పూర్‌, ఝార్సుగూడ, రూర్కెలా, బొకారో స్టీల్‌ సిటీ, ధన్‌బాద్‌, ఝాఝా, జాసిదిహ్‌, చిత్తరంజన్‌, బరౌని, దర్భంగా, సమస్తీపూర్‌, సీతామర్హి వంటి ఉత్తరభారత దేశంలోని ప్రధాన పారిశ్రామిక, పట్టణాలకు నేరుగా ప్రయాణసౌకర్యం లభించనుంది.

తెలంగాణాలో హాల్టింగ్స్‌

రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణాతో ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుసంధానమయ్యేలా ఈ రైలు నడవనున్నది. కృష్ణా జంక్షన్‌, వికారాబాద్‌, సికింద్రాబాద్‌, చర్లపల్లి, కాజీపేట జంక్షన్‌, పెద్దపల్లి జంక్షన్‌, మంచిర్యాల, సిర్పూర్‌ కాగజనగర్‌ స్టేషన్లలో హాల్ట్‌ సౌకర్యం కల్పించారు.

వలస కార్మికులు, ఉద్యోగులకు వరం

ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు స్థిరపడ్డారు. అలాగే గుంతకల్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని విభాగాలలో బీహార్‌తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైల్వే ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లాలంటే ఇప్పటివరకు గూడూరు జంక్షన్‌కు లేదా విజయవాడకు వెళ్లి, అక్కడ వేరే రైళ్లు మారాల్సి వచ్చేది. తాజా తిరుపతి–రక్సల్‌ ఎక్స్‌ప్రెస్‌తో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్‌ పడినట్లయింది.

17433/34 రక్సల్‌–తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మొత్తం 24 బోగీలు ఉంటాయి. ఇందులో సెకండ్‌ ఏసీ – 3 కోచ్‌లు, థర్డ్‌ ఏసీ – 5 కోచ్‌లు, స్లీపర్‌ కోచ్‌లు – 10, జనరల్‌ కోచ్‌లు – 4, ఎస్‌ఎల్‌ఆర్‌ – 2 కోచ్‌లు

1 నుంచి ‘తిరుపతి–రక్సల్‌’వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

కడప, ఎర్రగుంట్ల మీదుగా బీహార్‌కు నేరుగా రైలు

సరికొత్త రైలును ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

ఒకే రైలు.. ఎన్నో ప్రయోజనాలు

కడప మీదుగా జ్యోతిర్లింగ దర్శనం

నేపాల్‌కు మార్గం సుగమం

ఉత్తర భారత కార్మికులు,ఉద్యోగుల కష్టాలకు చెక్‌

వైఎస్సార్‌ కడప జిల్లాలోని రైలుమార్గంలో ప్రస్తుతానికి కడప, ఎర్రగుంట్ల స్టేషన్లలో మాత్రమే తిరుపతి–రక్సల్‌ రైలు ఆగనున్నది. అయితే రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట, మరియు ఎంతోమంది రైల్వే ఉద్యోగులు, కార్మికులకు నిలయమైన ప్రముఖ రైల్వేకేంద్రం నందలూరు స్టేషన్లలో కూడా ఈ రైలుకు హాల్టింగ్‌ ఇస్తే స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రయాణికులు కోరుతున్నారు. ఆ దిశగా రైల్వేశాఖ యోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement