పెద్దతిప్పసముద్రం : ఒంటిపై కిరోసిన్ పోసి హత్యా యత్నానికి పాల్పడిన, కట్నం కోసం వేధింపులకు గురి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పరమేశ్ నాయక్ తెలిపారు. బుధవారం ఎస్‌ఐ తెలిపిన కథనం మేరకు వివరాలిలా.. మండలంలోని అంకిరెడ్డిపల్లికి చెందిన కోనమ్మ (60), బయప్ప (65) దంపతుల కుమారుడు బయారెడ్డి (35)కి ఇదే పంచాయతీలోని తోకలవారిపల్లికి చెందిన స్ఫూర్తి (30) అనే యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగింది. కాగా.. భర్తతో పాటు అత్తా, మామల వేధింపులు తాళలేక నెల రోజుల క్రితం స్ఫూర్తి తోకలవారిపల్లికి చేరుకుంది. తన భార్య కాపురానికి రాలేదని భర్త ఆమైపె మరింత అనుమానం పెంచుకున్నాడు. ఈ తరుణంలో ఈ నెల 26న బయారెడ్డి ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్ తీసుకుని తోకలవారిపల్లిలో ఉన్న భార్య స్ఫూర్తి, ఆమె పిన్నమ్మ సుజాతల ఒంటిపై పోసి హత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్ఫూర్తి ఫిర్యాదు మేరకు భర్తపై హత్యాయత్నం, అత్తా, మామలపై అదనపు కట్నం కోసం వేధింపుల కేసు నమోదు చేసి ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసామని ఎస్‌ఐ తెలిపారు. అనంతరం హత్యా యత్నానికి పాల్పడిన బయారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని ఎస్‌ఐ పేర్కొన్నారు.
అత్తా, మామలపై వరకట్న వేధింపుల కేసు


