మట్టి టిప్పర్‌ ఢీకొని దంపతులకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

మట్టి టిప్పర్‌ ఢీకొని దంపతులకు గాయాలు

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

మదనపల్లె టౌన్‌ : అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు, వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు తట్టివారిపల్లె సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనపగుట్టకు చెందిన లక్కీరాజు(30), లక్ష్మి(25), వారి కుమారుడు గోవింద రాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా, మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్‌ వీరిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురూ రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం భార్యాభర్తలు, వారి కుమారుడి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్రమ మట్టి రవాణా చేస్తున్న టిప్పర్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో భవన కార్మికుడు తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం కురబలకోట మండలంలో జరిగిన రోడ్డు ప్రమదానికి సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. బి.కొత్తకోటకు చెందిన కె.రమణ (45) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు బయలు దేరాడు. స్కూటర్‌ మార్గంమధ్యలోని కురబలకోట మండలం అంగళ్లు గ్రామం చేనేత నగర్‌ వద్దకు రాగానే.. కారు వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డ రమణను వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్‌ చేశారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్సై మధురామ చంద్రుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement