వాల్మీకిపురం : మండల పరిధి కొత్త మంచూరులోని సోమేశ్వరస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆదివారం ఉదయం చోరీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి చొరబడి.. అదే సమయంలో అక్కడున్న పూజారి సీతారామయ్యను హతమార్చి దొంగతనానికి పాల్పడ్డారు. తాజాగా ఈ పురాతన సోమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి బంగారు మంగళసూత్రంతో పాటు హుండీలో ఉన్న దాదాపు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే ఆలయంలోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న వస్తువులను చిందరవందర చేశారు. ఈ ఆలయంలో వరుస చోరీలతో మంచూరు గ్రామస్తులు హడలిపోతున్నారు.


