ఇక్కడ ప్లాట్లు కొంటే పాట్లే | - | Sakshi
Sakshi News home page

ఇక్కడ ప్లాట్లు కొంటే పాట్లే

May 17 2026 1:30 AM | Updated on May 17 2026 1:30 AM

రియల్టర్ల మాయాజాలం

నోటీసులు ఇచ్చినా తగ్గేదేలా..

బరితెగించిన రియల్టర్లు

అక్రమ వెంచర్లలో హెచ్చరిక బోర్డులు

కురబలకోట : ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో.. అంగళ్లులోని రియల్టర్ల రూటే సపరేటు. మాయా మశ్చీంద్రను తలపిస్తున్నారు. ఆశావహులకు ఆశ చూపి పద్మ వ్యూహమనే ముగ్గులోకి దించుతున్నారు. సెలవు రోజుల్లో అయితే కొనుగోలుదారులను ఆహ్వానించి విందు భోజనాలు ఏర్పాటు చేసి ప్లాట్లు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలో అంగళ్లు బైపాస్‌, కురబలకోట, కడప రోడ్డులో 1750/1, 1751, 850, 569, 543 సర్వే నంబర్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అనధికార లే అవుట్లను వేశారు. అంతేగాకుండా ప్లాట్లను అందంగా మార్చి విక్రయించసాగారు. వీటికి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేవు. అయినా కొనుకోలుదారులను బురిడీ కొట్టించి ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో అక్రమ రియల్‌ దందాపై అధికారులు దృష్టి సారించారు. ఇదివరకే జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మ సంబంధిత గ్రామ కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు. అక్రమ రియల్‌ వెంచర్లపై చర్యలు తీసుకోవడం లేదని సీరియస్‌ అయ్యారు. అంతేగాకుండా పలుమార్లు రెగ్యులర్‌ చేసుకోవాలని హెచ్చరించినా బేఖాతార్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశాలతో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో అక్రమ లే అవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అనుమతులు లేని ఈ వెంచర్లలో క్రయ, విక్రయాలు చేయరాదని రియల్‌ ప్లాట్లలోనే కాకుండా అంగళ్లు పోలీస్‌ స్టేషన్‌, స్థానిక బస్టాండ్‌లో కూడా ప్రజలు చూడటానికి వీటిని ఏర్పాటు చేశారు. వెంచర్ల నిర్వాహకులు అనుమతులు తీసుకోకపోతే వెంచర్లలో ఏర్పాటు చేసిన ప్లాట్లను, రోడ్లును కూల్చి వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement