ప్రహరీ కూల్చివేతపై ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

ప్రహరీ కూల్చివేతపై ఉద్రిక్తత

May 17 2026 1:30 AM | Updated on May 17 2026 1:30 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె పట్టణం జన్మభూమి కాలనీలో 1996లో రిజిస్టర్‌ అయిన స్థలంలో నిర్మిస్తున్న ఇంటికి రక్షణ గోడను కూల్చేందుకు శనివారం మున్సిపల్‌, సచివాలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. నోటీసు ఇచ్చిన 12 గంటల్లోనే జేసీబీతో కూల్చివేతకు యత్నించారు. దీంతో ఇంటి యజమాని వాసుదేవ, సచివాలయ సిబ్బంది మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తతకు దారితీసింది. వాసుదేవ తన ఇంటి భద్రత కోసం ప్రహరీ నిర్మించుకున్నారు. గోడ హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ కింద నిర్మించారని, మున్సిపల్‌ అధికారులు కూల్చివేతకు ఉత్తర్వు ఇవ్వడంతో.. టిపిఎస్‌ రెడ్డెమ్మ, సచివాలయ సిబ్బంది, పోలీసులతో జేసీబీతో స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటి యజమాని వాసు, కుటుంబ సభ్యులు అడ్డుకుని సొంత స్థలంలో ప్రహరీ నిర్మించుకుంటుంటే ఎలా పడగొడతారని నిలదీశారు. బీసీ హక్కుల పోరాట సమితి నాయకుడు బిడేం రాజశేఖర్‌ అక్కడికి చేరుకుని మున్సిపల్‌ సిబ్బందిని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప కూల్చడానికి అధికారులకు హక్కు లేదని వాదించారు. అనంతరం మున్సిపల్‌ సిబ్బంది వెళ్లిపోయారు.

జేసీబీని ఢీకొన్న బైక్‌

పుంగనూరు : మండలంలోని సింగిరిగుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు సంతోష్‌(18) అనే యువకుడు శనివారం ద్విచక్రవాహనంలో వెళ్తూ ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంతోష్‌కు తీవ్ర గాయాలై, ఎడమకాలు విరిగింది. అటుగా వెళ్తున్న హెల్పింగ్‌ లయన్స్‌ సభ్యుడు బషీర్‌ అలీ గమనించి బాధితున్ని తన ఆటోలో ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడిపై దాడి

మదనపల్లె టౌన్‌ : యువకుడిపై దాడి జరిగిన సంఘటన శనివారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితుడు వన్‌టౌన్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పట్టణంలోని బుగ్గ కాలువలో కాపురం ఉంటున్న మణికంఠ బాబు(33) ఇంటి నుంచి మురుగు నీరు అదే వీధిలో ఉన్న వెంకటరమణ ఇంటి ముందుకు వచ్చాయని ఇరు వర్గాలు గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటకుమాట పెరగడంతో వెంకటరమణ తన అనుచరులతో మణికంఠ బాబుపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబీకులు బాధితుడిని చికిత్సల నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement