మదనపల్లె టౌన్/కలకడ : శాంతిభద్రతల పరిరక్షణ కోసం అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ శనివారం తెల్లవారుజామున రెండు భారీ ఆపరేషన్‌లను నిర్వహించింది. జిల్లాను నేర రహితంగా మార్చడానికి, సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న శక్తుల ఆటకట్టించడానికి జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో శనివారం మదనపల్లె, రాయచోటి ప్రాంతాల్లో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించారు. రెండు సబ్ డివిజన్లలోని సమస్యాత్మక ప్రాంతాలే లక్ష్యంగా పోలీసులు దాడులు నిర్వహించారు. మదనపల్లె డీఎస్పీ పావని నేతత్వంలో 105 మంది, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్.కష్ణమోహన్ నేతత్వంలో 61 మంది, మొత్తం 166 మంది పోలీసులు పాల్గొన్నారు. మదనపల్లె పరిధిలోని కోళ్లబైలు జగన్ కాలనీ, కలకడ మండలం బంగారువాండ్లపల్లి గ్రామాల్లో తనిఖీలు (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న మొత్తం 133 వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. ఆధారాలు లేని 78 వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందులో 71 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లు, ఒక ట్రాక్టర్ ఉన్నాయి. చట్టపరమైన పూర్తి పత్రాలు సమర్పించిన తర్వాతే ఈ వాహనాలను విడుదల చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. తనిఖీల అనంతరం మదనపల్లెలో 300 మంది, కలకడలో 210 మంది ప్రజలను ఒకచోటకు చేర్చి ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఊర్లోకి కొత్త వ్యక్తులు వచ్చినా, ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.


