మదనపల్లె టౌన్ : నేటి కంప్యూటర్ యుగంలో కూడా కుల వృత్తినే నమ్ముకుని వినాయకుని బొమ్మలు తయారు చేస్తూ, వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్న ఓ కుటుంబం పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. వ్యాపారం మందకొడిగా సాగడం, పెట్టుబడులు చేతికి అందకపోవడంతో.. అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోయారు. రుణ దాతల ఒత్తిళ్ల నుంచి బయటపడలేక చావే శరణ్యం అనుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ ఊరికి దూరంగా వెళ్లి.. మద్యంలో విషం కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శనివారం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం బికేపల్లి కాలనీలో కాపు రం ఉంటున్న అన్నదమ్ములు శ్రీనివాసులు (35), అనిల్ (30) కుమ్మర వృత్తిలో భాగంగా ఇంటి దగ్గరే వినాయకుడి బొమ్మలు తయారు చేసుకుంటూ అమ్మకాలు సాగించే వారు. ఈ క్రమంలో వారి వ్యాపారం మందకొడిగా సాగడంతో.. ఒక్కొక్కరు సుమారు 8 లక్షల నుంచి 11 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, రుణదాతల వేధింపులు అధికం కావడంతో జీవితంపై విరక్తి చెందారు. చనిపోవాలని నిర్ణయించుకుని ఇద్దరు అన్నదమ్ములు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పిటిఎం మండలం రంగసముద్రంలో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్లారు. అక్కడ మద్యంలో విషం కలుపుకొని తాగి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబీకులు గమనించి బాధితులను వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, మెరుగైన వైద్య చికిత్సలు అందించినా వారి ఆరోగ్యం కుదుట పడలేదు. అనంతరం ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో.. కుటుంబ సభ్యులు బాధితులను తిరుపతికి తరలించారు. ఘటనపై పిటీఎం పోలీసులు విచారణ చేస్తున్నారు. అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నానికి గల మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.


