మదనపల్లె టౌన్ : పట్టా కలిగి ఎన్నో ఏళ్లుగా తమ సాగులో ఉన్న భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలని పంటను దున్నేశారని బాధితుడు జోహార్ బాషా ఆవేదన వ్యక్తం చేశాడు. మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని చిప్పిలికి చెందిన సాబ్ జాన్‌కు తనతోపాటు మరో ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. తమకు సర్వే నంబర్ 115/1లో 1.64 ఎకరాల వ్యవసాయ పొలం ఉందని, తాను కుటుంబ బాధ్యతలు మోయడంతో ఆ భూమి తన పేరున కుటుంబ సభ్యులందరి ఆమోదంతో రిజిస్టర్ అయిందన్నారు. అప్పటి నుంచి తన భూమిలో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. ఇంతలో తన తమ్ముడు అహ్మద్ బాషా తమ దాయాదులైన దాదాపీర్, ఖాజా పీర్, షాదాబిలతో కలిసి భూమిని ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారన్నారని ఆరోపించారు. అంతేకాకుండా భూమిలో తమకు భాగం ఉందంటూ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారని, ఆ మేరకు విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి ఈ భూమి జోహార్ బాషాకే చెందుతుందని తేల్చి చెప్పి వెళ్లిపోయారన్నారు. అయినప్పటికీ అహ్మద్ బాషా తన దాయాదులతో కలిసి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. శుక్రవారం తాను ఊర్లో లేని విషయాన్ని పసిగట్టి తన భూమిలో సాగు చేసుకున్న అనుప పంటను పూర్తిగా దున్నేసి ధ్వంసం చేసి భూ కబ్జాకు పాల్పడ్డారని తెలిపారు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.
న్యాయం చేయాలని బాధితుడు వేడుకోలు


