మాజీ సర్పంచ్‌ భర్తపై పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్‌ భర్తపై పోలీసులకు ఫిర్యాదు

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

పెద్దతిప్పసముద్రం: మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ తాజా మాజీ సర్పంచ్‌ భర్తపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంపీడీఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎంపీడీఓ మాట్లాడుతూ సదరు మాజీ సర్పంచ్‌ భర్త తన పదవీ కాలంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం, జనరల్‌ ఫండ్‌ నిధులను ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా చెక్‌బుక్‌ ద్వారా రూ.లక్షల నిధులను ఇష్టారాజ్యంగా పలుమార్లు అనధికారికంగా డ్రా చేశారన్నారు. అంతేగాక పంచాయతీ నిధుల నుంచి తన కుమార్తె బ్యాంకు ఖాతాకు కూడా ఒకేసారి రూ.7 లక్షల నిధులను బదలాయించాడన్నారు. ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి రమేష్‌ ఈ విషయాన్ని గుర్తించి తనతో పాటు డీపీఓకు సైతం ఫిర్యాదు చేశారన్నారు. డ్రా చేసిన నిధులకు సంబంధించి ఎంబుక్‌ తదితర సమగ్రమైన రికార్డులను ఆధారాలతో అధికారులకు అందజేయాలని పలుమార్లు నోటీసులు అందజేసినా ఇంత వరకూ అతీగతీ లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంపీడీఓ వెళ్లడించారు.

ద్విచక్రవాహనం బోల్తా

ములకలచెరువు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాకొట్టడంతో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో మదనపల్లెలో పరీక్ష రాసేందుకు వెళ్తూ టోల్‌గేట్‌ వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న నరేంద్రకు తీవ్రగాయాలయ్యాయి. అటువైపు వెళ్తున్న బి.కొత్తకోట మండలం అమరనారాయణపురానికి చెందిన సంషద్‌ తన కారులో బాధితుడిని తీసుకొని వెళ్తూ 108 వాహనానికి సమాచారం అందించాడు. అనంతరం మార్గ మధ్యలో బాధితుడిని 108 వాహనంలో ఎక్కించి మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

మదనపల్లె టౌన్‌: జిల్లా ఆర్మ్‌డ్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.రంగారావు (52) అనారోగ్యంతో గురువారం రాత్రి కర్నూలులో కన్ను మూశారు. విధి నిర్వహణలో ఆయన చనిపోయారు. శుక్రవారం కర్నూలులోని సీతారాం నగర్‌లో రంగారావు మృతదేహాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్‌ ఆదేశాలతో జిల్లా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. రవికుమార్‌ పోలీస్‌ శాఖ తరపున పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్మశానవాటికలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు.

ఆర్థిక సాయం అందజేత:

మృతుని భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ పరామర్శించారు. ఎస్పీ సూచనలతో తక్షణ సహాయంగా దహన సంస్కారాల నిమిత్తం లక్ష నగదు మృతిని భార్యకు అందజేశారు.

ఆసుపత్రిలో ఆ నలుగురిని

తొలగించే చర్యలు తీసుకోండి

మదనపల్లె టౌన్‌: మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు మహిళలతో పాటు, వ్యక్తిగత విషయాలపై ఆసుపత్రి ఆవరణలో కొట్టుకున్న జూనియర్‌ అసిస్టెంట్లను విధుల నుంచి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌ ను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమావేశమై ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

మృతుడి ఆచూకీ లభ్యం

మదనపల్లె టౌన్‌: మదనపల్లె మండలంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం పాఠకులకు తెలిసిందే. ఘటనకు సంబంధించి స్థానిక తాలూకా పోలీసులు మృతుడి ఆచూకీ కనుగొన్నారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు.. రామసముద్రం మండలం, మినికి గ్రామానికి చెందిన నారాయణ స్వామి కొడుకు నాగార్జున (40) సొంత పని మీద ద్విచక్ర వాహనంలో మదనపల్లి వచ్చాడు. పని ముగించుకుని మండలంలోని వలసపల్లి గ్రామం మొలకల దిన్నెలో ఉన్న అత్తగారి ఇంటికి బైక్‌ లో వెళుతుండగా, మార్గ మధ్యంలోని బై పాస్‌ రోడ్డులో ఉన్న వెన్నెల రెస్టారెంట్‌ వద్ద లారీ మృత్యువు రూపంలో వచ్చి ఢీకొట్టడంతో నాగార్జున ప్రాణాలు విడిచాడు. సంఘటన సమాచారం అందుకున్న తాలూకా సీఐ కళా వెంకట రమణ, ఎస్సై చంద్రమోహన్‌ ఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని పరిశీలించారు. లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడని గుర్తించామని తెలిపారు. పంచనామా అనంతరం పోస్టు మార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement