ఖరీఫ్‌కు ప్రత్యామ్నాయం సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు ప్రత్యామ్నాయం సిద్ధం చేయండి

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

వ్యవసాయ శాఖ జిల్లా సమీక్షలో శివనారాయణ

సాక్షి, మదనపల్లె: జిల్లాలో ఖరీఫ్‌ వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికతో పాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శివ నారాయణ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జిల్లాలోని ఏవోలు, ఏడీఏలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు. దీన్నిబట్టి చూస్తే ఖరీఫ్‌ వ్యవసాయం ఈసారి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంవల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. దీనికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రైతులు వినియోగిస్తున్న ఎరువుల వాడకాన్ని 50 శాతానికి తగ్గించాలని సూచించారు. భూసార పరీక్షలు పెంచడం ద్వారా ఎరువుల వినియోగం తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. రైతులు తప్పనిసరిగా ఏపీఎఫ్‌ఆర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని లేనిపక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు రైతులకు ఆందవని స్పష్టం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, ఈనెల 19వ తేదీ ఆఖరని తెలిపారు. జనుము, జీలుగ, పిల్లి పెసర, విత్తనాల పంపిణీ ప్రారంభించాలని తెలిపారు. సమావేశంలో ఏడీలు నవీన్‌ కుమార్‌ రెడ్డి, శ్రీలత, జయరాణి, శివకుమార్‌, నాగ ప్రసాద్‌, కరుణాకర్‌ రెడ్డి, మజీద్‌ అహ్మద్‌, డిపిఎం వెంకట మోహన్‌, మార్క్ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ శ్రీరాములు, మాలతి రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement