నవోదయలో 11వ తరగతికి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

నవోదయలో 11వ తరగతికి దరఖాస్తులు

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

నవోదయలో 11వ తరగతికి దరఖాస్తులు దరఖాస్తుల ఆహ్వానం టమాటా రైతుకు ఊరట జపాన్‌లో ఉపాధి అవకాశాలు చెత్త ప్రాసెసింగ్‌ పరిశీలన కూలీల సంఖ్య పెంచాలి

మదనపల్లె సిటీ: మదనపల్లె సమీపంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలోని 2026–27 విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న కామర్స్‌ స్ట్రీమ్‌ సీట్లు భర్తీ చేయనున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఎం.గీత తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసైన అర్హత గల విద్యార్థులు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు విద్యాలయ కార్యాలయం నందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తును సమర్పించాలన్నారు.

పుంగనూరు: పుంగనూరు సమీపంలోని ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులకు రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. నిరంతరం వైఫై తో పాటు డిజిటల్‌ తరగతులు, ల్యాబ్‌, అత్యాధునిక సదుపాయాలు, నిపుణులైన అధ్యాపకులతో క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 9381359956, 9010402068 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

పుంగనూరు: టమోటా పండించిన రైతులకు ధరలు ఊరటనిస్తున్నాయి. 10 కిలోల టమోట రూ.300లు కాగా, మూడో రకం రూ.260లు పలికింది. మార్కెట్‌ కమిటీకి 84 మెట్రిక్‌ టన్నుల టమోటాను రైతులు తరలించారు. టమోటాను చైన్నె, విజయవాడ, హైదరాబాద్‌కు వ్యాపారులు తరలించారు. రైతులు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇలా కొనసాగితే అప్పుల ఊబిలో నుంచి బయట పడుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, మదనపల్లె: జిల్లాకు చెందిన యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు జపాన్‌ జాబ్‌ ఆపర్చునిటీ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి నాగార్జున శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు శ్రీ సిటీలో 6 నుంచి 8 నెలలు జపనీస్‌ భాష శిక్షణ, జపాన్‌ సంస్కృతి, ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌, డొమైన్‌ స్కిల్స్‌, ప్లేస్‌మెంట్‌ సపోర్ట్‌ అందిస్తామన్నారు. అనంతరం తయారీ, కేర్‌ గివింగ్‌, నిర్మాణరంగం, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్‌ రంగాల్లో ఉద్యోగ అవకాశాలుంటాయని తెలిపారు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య, కనీస విద్యార్హత 10వ తరగతి, ఇంటర్‌ ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు సుమారు రూ.1,03,996 నుంచి రూ.1,45,000 వరకు వేతనం పొందవచ్చని తెలిపారు.

మదనపల్లె: బి.కొత్తకోట నగర పంచాయతీ కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ కింద రూ.1.52 కోట్లతో మంజూరైన చెత్త నిర్వహణ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులను శుక్రవారం అధికారులు పరిశీలించారు. బి.కొత్తకోట–చలిమామిడి మార్గంలోని డంపింగ్‌ యార్డ్‌లో కేటాయించిన 0.6 ఎకరాల స్థలంలో పనులు ప్రారంభం కాగా.. నగర పంచాయతీ కమిషనర్‌ రమాదేవి, ఏఈ లోకేష్‌ రెడ్డి, నిర్మాణ సంస్థ మేనేజర్‌ బ్రహ్మానందరెడ్డి పనుల పురోగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రమాదేవి మాట్లాడుతూ.. ఈ యూనిట్‌ అందుబాటులోకి వస్తే పట్టణంలో సేకరించిన చెత్త నుంచి తడి, పొడి, ప్లాస్టిక్‌ వ్యర్థాలను శాసీ్త్రయంగా వేరు చేయడం సులువవుతుందని పేర్కొన్నారు.

సాక్షి, మదనపల్లె: జిల్లాలో ఉపాధి హామీ కింద పనులు చేసే కూలీల సంఖ్యను తక్షణమే పెంచాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (పీడీ) వెంకటరత్నం హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కూలీల సంఖ్య 52 వేలకు చేరిందని, నెలాఖరుకల్లా దీన్ని 70 వేలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఏప్రిల్‌ మూడో వారం వరకు కూలీ సొమ్ము చెల్లించామని, నిర్లక్ష్యం వహిస్తే వెనుకబడిన మండలాల నివేదికను కలెక్టర్‌కు పంపుతామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement