సాక్షి, మదనపల్లె: దళిత సంక్షేమానికి మార్గదర్శకుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు దళిత శ్రేణులన్నీ ఐక్యంగా కదలిరావాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్క అంజినప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం మదనపల్లెలోని జీనత్ కళ్యాణమండపంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రా మ్, వైఎస్సార్‌ల చిత్రపటాలకు నివాళులర్పించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర
సభలో చుక్క అంజినప్ప మాట్లాడుతూ.. దళితుల ఆత్మగౌరవం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న హయాంలో ఎస్సీలకు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో అగ్రతాంబూలం ఇచ్చారని గుర్తుచేశారు. పేద వర్గాల పిల్లల కోసం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తూ పేదలకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఆరోపించారు. అమలు చేయలేని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు జరుగుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.
అంబేద్కర్ విగ్రహంపై కక్ష
ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణ మాట్లా డుతూ జగనన్న విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మహాత్మా అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ స్మృతి వనాన్ని కూటమి ప్రభుత్వం కనీస నిర్వహణ లేకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. జిల్లా పరిశీలకులు రాజగోపాల్ మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం, సంక్షేమం కేవలం జగనన్నతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గద్దె దించడానికి దళితులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నేతలు హేమంత్, దండుగోపి, నక్కా రమాదేవి, జి.నాగమణి, సాక్సా రామాంజనేయులు, శ్రీహరి, రాజకుమార్, మహేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
అందుకు దళితులంతా ఐక్యంగా పోరాడాలి
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత సమావేశంలో చుక్క అంజినప్ప గర్జన


