పెద్దతిప్పసముద్రం: ప్రభుత్వ కార్యాలయాల్లో పద్నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనరేటర్లకు భద్రత లేకుండా పోతోంది. డేటా ఎంట్రీ ఆన్‌లైన్ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు 2012లో అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 66 మండలాల్లో జనరేటర్లను అమర్చారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం బయట అమర్చిన జనరేటర్ వాడుకలో లేనందున ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నా పట్టించుకునేవారు లేరు. టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేసారు. అయితే ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఒక్కొక్క జనరేటర్‌కు రూ.లక్ష చొప్పున వెచ్చించి వీటిని ఏర్పాటు చేసారు. జనరేటర్ల సరఫరా, నిర్వహణ బాధ్యతలను ఏపి స్వాన్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ప్రారంభంలో సంస్థ నిర్వాహకులు జనరేటర్లకు కనెక్షన్ ఇవ్వడంతో అవి కొద్ది రోజులు మాత్రమే పని చేసాయి. అనంతరం కనెక్షన్ కూడా తొలగించేసినట్టు సమాచారం. జనరేటర్లు చిన్న, చిన్న మరమతులకు నోచుకోకపోవడంతో అవి కాస్త నిరుపయోగంగా మారిపోయాయి. ఫలితంగా జనరేటర్ల పరికరాలు తుప్పు పట్టి పాడైపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్న ఇన్వర్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లకు అంతరాయం కలగడం లేదు. దీంతో అధికారులు జనరేటర్ వుందనే విషయాన్నే మరచిపోతున్నారు. అయితే అప్పటి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రూ.లక్షల రూపాయల నిధులు వృధా అవుతున్నాయి. కనీసం ఇప్పటికై నా సంభంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిరుపయోగంగా మారిన జనరేటర్లను వాడుకలోకి తేవాల్సిన అవసరం ఉంది.
తహసీల్దార్ కార్యాలయంలో
ఇంటర్‌నెట్ సౌకర్యం నిల్
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నాలుగైదు నెలలుగా ఇంటర్‌నెట్ సౌకర్యం లేదు. ఏపీ స్వాన్ సంస్థ ప్రభుత్వ కార్యాలయాల వద్ద నెట్ వర్క్ కేబుల్ సౌకర్యం కల్పించినా ఫలితం లేకుండా పోయింది. నెట్‌వర్క్ సమస్య ఉందని తెలిసినా మండల స్థాయి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే గాని ఏపీ స్వాన్ సంస్థపై ఒత్తిడి తెచ్చి నెట్ వర్క్ అందేలా చేసేందుకు ఎలాంటి చొరవ చూపకపోవడం శోచనీయం. తద్వారా కంప్యూటర్ ఆపరేటర్లు వారి స్వంత మొబైల్‌లో అదనపు రోజువారి ఇంటర్ నెట్ డేటాతో పనులు చేయాల్సిన దౌర్భాగ్యస్థితి నెలకొంది. మిగిలిన మండలాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తుప్పు పడుతున్న జనరేటర్లు
నాలుగైదు నెలలుగా ఇంటర్‌నెట్ సౌకర్యం లేక సిబ్బంది పాట్లు
పట్టించుకోని అధికారులు


