వాల్మీకిపురం: ఉమ్మడి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పట్టణంలోని జీవీఎస్‌సీఎస్ క్రీడా మైదానంలో సీసీఎల్– 2 క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. టోర్నమెంట్‌లో భాగంగా గురువారం ఉదయం నితిన్ వారియర్స్, పాయి వైస్రాయ్ జట్లు తలపడగా పాయ్ వైస్రాయ్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వినయ్‌కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే మధ్యాహ్నాం ఎన్‌కే స్పోర్ట్స్, హై పీరియన్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. ఈ మ్యాచ్‌లకు క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యాక్షులు గుండ్లూరి శ్రీధర్ కుమార్, సెక్రటరీ సతీష్ యాదవ్, కోచ్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి అక్కడకక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికులు తెలిపిన వివరాలు. సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మదనపల్లె మండలంలోని కొండా మరిపల్లి సమీపాన ఉన్న వెన్నెల రెస్టారెంట్ సమీపంలో బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడి కక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ కళా వెంకటరమణ, ఎస్‌ఐ చంద్రమోహన్ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడిపై హత్యాయత్నం
మదనపల్లె టౌన్: భూ వివాదం తలెత్తి ఓ యువకుడి పై ప్రత్యర్థులు రాళ్లు, రాడ్లతో విచక్షణార హితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం గుర్రంకొండలో చోటు చేసుకున్న ఘటనపై బాధితుని కథనం.. గుర్రంకొండలో నివాసం ఉంటున్న కేఎండీ వారిష్(30)కు ఊరికి సమీపంలో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి, మామిడి తోట ఉంది. అదే ఊరికి చెందిన అస్కర్ అలీ ఖాన్, మహమ్మద్ ఫైజల్, బాష, రహమత్ మరి కొందరు వెళ్లి ఆ భూమిలో తమకూ వాటా రావాల్సి ఉందని దౌర్జన్యంగా మామిడికాయలు కోసి తరలిస్తుండగా, తోట యజమాని వారీష్ వెళ్లి వారిని అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ప్రత్యర్థులు రాళ్లు, రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుర్రంకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీఆర్‌ఏపై దాడి: తలకు గాయం
కేవీపల్లె : వీఆర్‌ఏపై కర్రతో దాడి చేయడంలో తలకు గాయమైన సంఘటన మండలంలోని గర్నిమిట్ట పంచాయతీ బలిజపల్లెలో చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు వివరాలిలా వున్నాయి. బలిజల్లెకు చెందిన వీఆర్‌ఏ చెంగల్‌రాయుడు గ్రామంలో శ్రీరాములవారి ఆలయానికి కొన్నేళ్లుగా ధర్మకర్తగా ఉన్నాడు. ఆలయానికి సంబంధించి అభివృద్ధి, గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి సంబంధించి గ్రామస్తుల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ క్రమంలో గర్నిమిట్టకు చెందిన పార్థసారధి అలియాస్ ధనుంజయ కర్రతో దాడి చేయడంతో చెంగల్‌రాయుడు తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
వాల్మీకిపురం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని గంగాదొడ్డి వద్ద చోటు చేసుకొంది. వివరాలు.. కూరపర్తికి చెందిన గౌతమ్ కుమార్‌రెడ్డి (20) ద్విచక్రవాహనంలో మదనపల్లె నుంచి సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా గంగాదొడ్డి వద్ద ఎదురుగా టమాటా లోడుతో వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గౌతమ్‌కుమార్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు అతన్ని 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు రెఫర్ చేశారు.
పోలీసుల అదుపులో క్రికెట్ బుకీలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో క్రికెట్ బుకీల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడిలో ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకోగా గాంధీరోడ్డులోని ప్రధాన క్రికెట్ బుకీ తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. హిందూపురంలో క్రికెట్ నిర్వహిస్తూ అక్కడి బుకీలు కొందరు రెండు రోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన క్రికెట్ బుకీలకు ప్రొద్దుటూరులోని ఇద్దరు బుకీలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరి ద్వారా గాంధీరోడ్డులోని ఒక ప్రధాన బుకీకి లింక్ ఉన్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. దీంతో రూరల్ పోలీసులు బుధవారం అర్దరాత్రి సమయంలో ఏక కాలంలో బుకీల ఇళ్లపై దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల రాకను పసిగట్టిన గాంధీరోడ్డులోని క్రికెట్ బుకీ తప్పించుకున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో డబ్బు కూడా దొరికినట్లు తెలుస్తోంది. పట్టుబడిన బుకీలను పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు.


