సాక్షి ప్రతినిధి, కడప: ముద్దనూరు–బి.కొత్తపల్లె నేషనల్ హైవే (ఎన్‌హెచ్–716) రహదారి పరిహారం కొల్లగొట్టేందుకు తెలుగుతమ్ముళ్లు మాస్టర్ ప్లాన్ రచించారు. స్వల్పంగా భూమి కోల్పోతే సర్వం పోయినట్లు రికార్డుల్ని తారుమారు చేశారు. పైపులైన్ కోల్పోయినట్లు, బోరుబావులు గల్లంతవుతున్నట్లు రికార్డులు రూపొందారు. అంతేకాదు భవనాలు, పండ్లు, కూరగాయాల తోటలు కోల్పోయినట్లు పక్కాగా కథలల్లి ప్రజాధనం కాజేసే కుట్ర పన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే లేనిది ఉన్నట్లు రికార్డులు పుట్టించారు. ఆపై లక్షలాది రూపాయాలు కొల్లగొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు.
● ముద్దనూరు–బి.కొత్తపల్లె రహదారిలో భూసేకరణలో అనేక వైఫల్యాలు వెలుగుచూశాయి. అక్రమాల నేపధ్యంలో ఇదివరకే తొండూరు విలేజ్ రెవెన్యూ అధికారి నరహరి సస్పెండ్ ఉదంతం వెలుగు చూసింది. నరహరి అవినీతి తీగలాగితే అధికార పార్టీ నేతల అక్రమాల డొంకంతా కదిలింది. తొండూరు, మల్లేల గ్రామాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.కోటి పరిహారం తెలుగుతమ్ముళ్లకు భోజ్యంగా మారింది.
వీఆర్‌ఓ సస్పెండ్‌తో బయటపడ్డ బాగోతం....
మల్లేల గ్రామంలో ఓ రైతుకు చెందిన కొంత భూమి ఎన్‌హెచ్ హైవే రోడ్డుకు కోల్పోయారు. ఆ కొద్ది భూమిలోనే వ్యవసాయబోర్లు, పైపులైన్లు, పండ్ల తోటలు ఉన్నట్లు రికార్డులు సృష్టించి దాదాపు రూ.10లక్షలకుపైగా పరిహారం అధికారులు మంజూరు చేసినట్లు సమాచారం. అలాగే తొండూరు గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు కోల్పోతున్న భూముల్లో బోర్లు, బావులు, పండ్లతోటలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. అయినప్పటికీ హైవే రోడ్డు ఏర్పాటు కారణంగా విద్యుత్ కనెక్షన్లు, పైపులైన్లు, బోర్లు, పండ్ల మొక్కలు కోల్పోతున్నట్లు రికార్డులు సృష్టించారు. జిల్లా స్థాయి రెవిన్యూ యంత్రాంగం రైతులతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయగా వీఆర్‌ఓ నరహరి మాత్రమే సమాధానాలు ఇవ్వసాగారు. రైతులు లేకుండా వారి అభ్యర్థన తెలుసుకోకుండా మొత్తం వ్యవహారం నరహరి నడిపారనే అంచనాకు వచ్చిన అధికారులు ఈనెల 9న సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నరహరి సస్పెండ్‌తో మొత్తం బాగోతం బహిర్గతమైంది. ఎన్‌హెచ్ పరిహారంలో అధికార పార్టీకి వారికే లక్షలకు లక్షలు పరిహారం మంజూరైనట్లు తెలిసింది. ఆమేరకు ఆయా రైతుల అకౌంట్లకు డబ్బులు జమ చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది.
ఎన్‌హెచ్–716 రహదారి భూసేకరణలో అక్రమాలు
అధికార పార్టీ నేతల అక్రమాలకు అండగా నిలుస్తోన్న యంత్రాంగం
తొండూరు మండలంలో రెవెన్యూ అధికారుల చేతివాటం
వీఆర్‌ఓ నరహరి సస్పెండ్‌తో బయటపడ్డ భాగోతం
ప్రభుత్వ పరిహారాన్ని బొక్కేస్తున్న తెలుగుతమ్ముళ్లు అర్హులకు మొండిచేయి చూపడంతోనే అసలు సమస్య ఉత్పన్నమైంది. తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన రైతులు భూములు కోల్పోతున్నారు. కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి పండ్ల తోటలు పండించుకుంటున్నారు. అలాంటి రైతులకు నష్టపరిహారం మంజూరు చేయడంలో వివక్షత ప్రదర్శించారు. లేనిది ఉన్నట్లు రికార్డులు పొందుపర్చిన రెవెన్యూ యంత్రాంగం ఉన్నది ఉన్నట్లుగా రికార్డులు రాసేందుకు మనసొప్పడం లేదు. అర్హులైన సామాన్య రైతులకు అన్యాయం చేసేందుకే సిద్ధమయ్యారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులకు ఒక న్యాయం, సామాన్య రైతులకు మరొక న్యాయం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం చర్యలుండిపోయాయి. ఇప్పటికై నా జిల్లా రెవెన్యూ అధికారులు ఎన్‌హెచ్ హైవే రోడ్డు పరిహారం అవకతవకలపై పునః పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తూనే, అనర్హులను కట్టడి చేసి ప్రజాధనాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.


