మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పడుకున్న చోటనే పాము కాటుకు గురై ఓ వృద్ధమహిళ ప్రాణాలు విడచింది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబల కోట మండలం, మట్లివారిపల్లి గ్రామం, కోణంగివారిపల్లికి చెందిన మునస్వామి భార్య ఈరమ్మ (70) రాత్రి అందరిలాగే ఇంట్లో నిద్రపోయింది. తెల్లవారు జామున ఓ పాము ఆమెను కాటేసింది. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో కుటుంబీకులు గమనించి, చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడక చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రడు తెలిపారు.
మహిళకు అస్వస్థత
మదనపల్లె టౌన్ : విష సర్పం కాటేసి వృద్ధ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన తంబళ్లపల్లె మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలు కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని కోసువారిపల్లె పంచాయతీ, చిటికివారిపల్లికు చెందిన లేట్ వెంకటరమణ భార్య రెడ్డెమ్మ (65) ఉదయం ఇంట్లో చెత్త ఊడ్చుతుండగా విష సర్పం చేతిపై కాటేసింది. అస్వస్థతకు గురైన బాధితురాలని, కుటుంబీకులు 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడక పోవడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
పేకాట రాయుళ్ల అరెస్టు
తంబళ్లపల్లె : మండలంలోని కోటకొండ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచార అందుకున్న స్పెషల్ బ్రాంచి సీఐ రాజారమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం దాడి చేశరు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.33,900 నగదు, 5 సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని తంబళ్లపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
బండలాగుడు పోటీలు
చాపాడు : హనుమజ్జయంతి వేడుకలలో భాగంగా మండలంలోని విశ్వనాథపురంలో బుధవారం నిర్వహించిన బండలాగుడు పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో కడప జిల్లా చాపా డు మండలం విశ్వనాథపురానికి చెందిన ఎస్‌ఎస్‌ఆర్ ఎడ్లు 3112 అడుగులు బండలాగి ప్రథమ స్థానంలో, బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన రామకృష్ణ ఎడ్లు 2884 అడుగులతో ద్వితీయ స్థానం, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెకు చెందిన మార్తల చంద్ర ఓబుళరెడ్డి ఎడ్లు 2786 అడుగులు లాగి తృతీయ స్థానం, మైదుకూరుకు చెందిన తిరుపాల్‌రెడ్డి, వెంకటేష్ ఎడ్లు 2774 అడుగులు లాగి నాలుగో స్థానంలో, విశ్వనాథపురానికి చెందిన లాస్యరెడ్డి ఎడ్లు 2537 అడుగులతో ఐదోస్థానం, కమలాపురం మండలం బాలయ్య గారిపల్లెకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఎడ్లు 2028 అడుగులతో ఆరోస్థానంలో నిలిచాయి. ఎడ్ల యజమానులకు వరుసగా రూ.లక్ష, రూ.80వేలు, రూ.60వేలు, రూ.40 వేలు, రూ.20వేలు, రూ.10వేలు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


