పులివెందుల రూరల్ : చైన్ స్నాచింగ్, బంగారు షాపుల్లో దొంగతనాలు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడిన 13 మంది దొంగలను అరెస్టు చేసినట్లు వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. బుధవారం సీఐ, ఎస్‌ఐలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 19 ద్విచక్రవాహనాలు, రూ.2.79 లక్షల నగదు, కేజీ వెండి, 194గ్రాముల బంగారు వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలోని కదిరి రోడ్డులో మున్సిపాలిటీ డంపింగ్ యార్డు వద్ద, కడప రింగురోడ్డు వద్ద ద్విచక్రవాహనాల దొంగలను, పార్నపల్లె బస్టాఫ్ వద్ద గోల్డ్ షాపులో బంగారు దొంగతనం చేసిన దొంగలను, ఉలిమెల్ల రింగ్ రోడ్డు వద్ద చైన్ స్నాచింగ్ పాల్పడే దొంగలు 13 మందిని 22 కేసుల్లో అరెస్టు చేసినట్లు చెప్పారు.ద్విచక్రవాహనాల దొంగల నుంచి రూ.2.79లక్షల నగదు, రూ.80వేలు విలువ చేసే కేజీ వెండి వస్తువులు, రూ.18.15లక్షల విలువ గల 19 బైక్‌లు, రూ.50వేలు విలువ చేసే రెండు సెల్ ఫోన్లు, చైన్‌స్నాచింగ్ దొంగల నుంచి రూ.13.52లక్షలు విలువ చేసే 91 గ్రాముల బంగారు వస్తువులు, బంగారు షాపుల్లో చోరీకి పాల్పడే దొంగల నుంచి రూ.15లక్షలు విలువ చేసే 103 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం రూ.53.00,700ల విలువ గల బంగారు, వెండి, నగదు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో నాగబాష. బూస్పాటి కుమార్, గంగయ్య, హుస్సేన్, మలికి విజయ్‌లను, అలాగే బీహార్ రాష్ట్రం భగల్పూర్ జిల్లాకు చెందిన చోటు కుమార్, నారాయణమ్మ, ఉమాదేవిలను అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని, వారిలో త్వరలో ఆరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ శ్రీరామ్, ఎస్‌ఐలు తిమోతి, మధుసూదన్‌రెడ్డి, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
బంగారం, ద్విచక్ర వాహనాలు స్వాధీనం


