సెల్‌ఫోన్ వద్దే వద్దు..
సెలవుల కాలం.. జర భద్రం!
వేసవి సెలవులపై
అవగాహన కల్పించాం
వేసవి సెలవులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఎండలో తిరిగితే కలిగే అనర్థాలు ఆర్యోగ సమస్యలపై అన్ని పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాం. విద్యార్థుల కదలికలపై దృష్టి సారించాలని తల్లిదండ్రులకు సూచించాం. వేసవిలో గ్రంథాలయాలు, వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. –డాక్టర్ సుబ్రమణ్యం డీఈఓ,
అన్నమయ్య జిల్లా
ఎండలో బయటికి పంపొద్దు
వేసవి సెలవుల్లో పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే ఆనందంగా గడిచిపోతాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు పంపించకపోవడం మంచిది. ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు పంపిస్తే మంచిది. ఎక్కువగా ఎండలో ఆటలాడటం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. –డాక్టర్ లక్ష్మినరసయ్య,
డిఎంహెచ్‌ఓ
పిల్లలను కనిపెట్టుకుని ఉండాలి
ఇంట్లో తెలియకుండా పిల్లలు సరదాగా స్నేహితులతో కలిసి ఈత సర దాతో బావులు,చెరువులు, కుంటలు వంటి ప్రదేశాలకు ఈతకు వెళ్తుంటారు. అక్కడ ఈత కొడుతున్నవారిని చూసి వీళ్లు కూడా ఈత రాకపోయినా సరదగా నీళ్లలోని దిగి ప్రాణాలు మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉంది. వేసవి సెలవుల్లో పిల్లలను భద్రంగా చూసుకోవాలి. –ప్రసాద్‌రెడ్డి,
పీడీ, హాకీ అన్నమయ్య జిల్లా కోశాధికారి
కడప ఎడ్యుకేషన్: నిన్నామొన్నటి వరకు పిల్లలతో సందడిగా ఉన్న బడులన్నీ నేడు వేసవి సెవులతో నిశ్శబ్దమైపోయాయి. ఆ సందడంతా ఇంటి గడపలకు చేరింది. సెలవు రోజుల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు అజాగ్రత్తల వల్ల ప్రమాదాల బారిన పడుతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే పిల్లలపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వారికి చెరువులు, నదులు, కుంటలు,బావులపై అవగాహన కల్పించాలి. దీంతోపాటు వారికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చి అప్రమత్తం చేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఎంతైనా ఉంది.
నీరు.. కాకూడదు కన్నీరు..
ఓ వైపు ఎండలు మరోవైపు ఉక్కపోత.. ఇంకేముంది నీరు కనిపిస్తే చాలు పిల్లలకు ఎక్కడ లేని ఉల్లాసం ఉరకలేస్తుంది. ఆనందం పొంగుకొస్తుంది. ఈ ఉల్లాసంలో నీటి మడుగులు, బావులు, చెరువుల ఎంతలోతు ఉన్నాయో ఆలోచించరు. ఈత వచ్చిన వారితో పాటు ఈత రానివారు కూడా సరదాగా దిగి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. చివరకు తల్లిదండ్రులకు కడపకోత మిగుల్చుతున్నారు. అందుకే ఈత రాని వారు చెరువులు, కాలువలు వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.
స్నేహితులతో బయటికి పంపిస్తే..
పిల్లలను ఆడుకునేందుకు స్నేహితులతో బయటికి పంపిస్తే ఎవరితో వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఎండలకు బయట తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు వేసవి కాలం కావడంతో వేడికి తట్టుకోలేక విష పురుగులు బొరియల నుంచి బయట వచ్చి చల్లటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. పిల్లలు ఆటల్లో పడి ఆదమరిస్తే వాటి కాటుకు గురి కావాల్సి ఉంటుంది. సెలవులు ముగిసే వరకు పిల్లలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
గాలి పటాలను ఎగుర వేసేటప్పుడు...
వేసవి సెలవులు కావడంతో పిల్లలు గాలిపటాలను ఎగురు వేసేటప్పు డు విద్యుత్తు తీగలతో జాగ్రత్తగా ఉండాలి. గాలిపటాలు విద్యుత్తు తీగల నడుమ ఇరుకొన్నప్పుడు వాటిని తొలగించేందుకు ఇనుపకడ్డీలు, పచ్చి కర్రలను వాడవద్దు. అలాగే క్రికెట్, ఫుట్‌బాల్ వంటి ఆటలాడుకునే సమయంలో విద్యుత్తు నియంత్రికల వద్ద జాగ్రత్తగా ఉండాలి.
చిన్న పిల్లలకు చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చిందంటే ఒళ్లు, ఇళ్లు మరిచిపోయి ఎన్ని గంటలైనా అలా సమయం గడిపేస్తూ ఉంటారు. పాఠశాలకు సెలవు రోజుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచాలి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు అల్లరి చేయకూడదనే ఉద్దేశ్యంతో సెల్‌ఫోన్‌ను పిల్లలకు ఇస్తుంటారు. మొదట్లో బాగానే ఉన్నా కొన్ని రోజులకు పిల్లలు ఆ సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోతారనే విష యాన్ని గ్రహించాలి. దీంతోపాటు సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ ఆటలకు, గేమ్‌లకు బానిసయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే సెల్‌ఫోన్‌లకు పిల్లలకు దూరంగా ఉంచాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం సరదాగా గడపాలి.
నదులు, చెరువులు, కాల్వలుప్రమాదాలకు నిలయాలు
పిల్లలు బయటకు వెళ్లినప్పుడుఓ కంట కనిపెట్టాలి
షికారుకు వెళ్లే పిల్లలకుతల్లిదండ్రులు సూచనలు చేయాలి
సమ్మర్ ట్రిప్ తీపి జ్ఞాపకాలుగా మిగలాలి
పాఠశాలలకు సెలవులు కావడంతో చాలా మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రలకు వెళుతుంటారు. విహార యాత్రల్లో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా విజయవంతం అయ్యి సంతోషాన్ని పొందాలంటే తగిన ప్రణాళికలు అవసరం. టూర్‌కు వెళ్లే ప్రతి ఒక్కరు ఫొటో, చిరునామాతో కూడిన గుర్తింపు కార్డు తమ వెంట ఉంచుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులందరితో పాటు విహార యాత్రకు వెళ్లే టప్పుడు ఆ బృందంలో ఒక్కొక్కరుగా పిల్లల బాధ్యతను పంచుకోవాలి. నీటి పరివాహక ప్రాంతాలు, కొండలు, లోయలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈతకొట్టడం, ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు.


