బి.కొత్తకోట: రోడ్ల అభివృద్ధికి సంబంధించిన పనులకు టెండర్లు దక్కించుకున్నా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అధికారులు ఒత్తిడి చేస్తుంటే ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే ఉన్న పెండింగ్ బిల్లులు ఇస్తేగాని పనులు చేయబోమని భీష్మించారు. దాంతో రహదారి అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఫలితంగా ప్రయాణికులకు తీవ్ర అవస్థలు మిగులుతున్నాయి.
పదేశ్ల తర్వాత
బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ 9 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు కలిగి ఉంది. కాండ్లమడుగు క్రాస్ నుంచి కొండపైకి ఈ రహదారి ఉంటుంది. పైకి వెళ్లేటప్పుడు ఎడమ, కుడివైపుల్లో లోతైన లోయలో ఉంటాయి. ఓవైపు కొండ అంచు నుంచి రహదారి నిర్మాణం బ్రిటిష్ పాలనా కాలంలో జరిగింది. అదే రహదారి అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2015లో కొండపైకి వెళ్లే రహదారిపై తారు రోడ్డు వేయించారు. ప్రస్తుతం ఈ రోడ్డు అక్కడక్కడ దెబ్బ తినడం, గుంతలతో నెలకొంది. దీనిపై మళ్లీ రోడ్డు వేసేందుకు అధికారులు పదేళ్లకు రూ.4.05 కోట్లతో టెండర్లు నిర్వహించారు. దీంతో కడపకు చెందిన ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ఈ చర్యలు పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు కాంట్రాక్టర్ పనులు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. పనులు పూర్తిచేస్తే దారి మెరుగుపడి ప్రమాదాలను నివారించగలిగే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నా పనులు ప్రారంభించేందుకు ససేమిరా అంటున్నారు. రహదారి భవనాల శాఖ అధికారులు పనులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. దీని కారణంగా పర్యాటక కేంద్రానికి మెరుగైన రహదారి కరువైంది.
గుంతలమయం బెంగళూరు రోడ్డు
మదనపల్లె–బెంగళూరు రోడ్డు (కర్ణాటక సరిహద్దు వరకు) గుంతలమయమైంది. ఈ రోడ్డు మరమ్మతుల కోసం రూ.4 కోట్లతో నిర్వహించారు. ఈ పనులు చేయాల్సిన కాంట్రాక్టర్ ఇంతవరకు పట్టించుకోలేదు. ఫలితంగా గుంతలమయన రోడ్డుపైనే అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల సిమెంటు పనులు చేయించారు. అయితే పూర్తిస్థాయిలో గుంతలతో నెలకొన్న రోడ్డు పనులు జరగలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కాంట్రాక్టర్ స్పందించడం లేదు. కడప, నెల్లూరు, తిరుపతి నుంచి మదనపల్లి మీదుగా బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలకు ఈ గుంతల రహదారి ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ పనులపై ప్రత్యామ్నాయ చర్యలు చెప్పవలసిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. దీనిపై డీఈ సూర్యనారాయణ మాట్లాడుతూ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేపట్టకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పారు.
దెబ్బతిన్న హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డు
గుంతలతో నిండిపోయిన బెంగళూరు రోడ్డు
రూ.4.05 కోట్లతో హార్సిలీహిల్స్ రోడ్డు
రూ.4 కోట్లతోమదనపల్లె–బెంగళూరు రోడ్డు
టెండర్ దక్కినాముందుకు రాని కాంట్రాక్టర్లు


