● భక్త కవయిత్రిగా ప్రసిద్ధి
● నేటి నుంచి జయంతి ఉత్సవాలు
● తిరుమల, తరిగొండలో వేడుకలు
గుర్రంకొండ : తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో అన్నమయ్య మేలుకొలుపు– వెంగమాంబ జోలపాట, ముత్యాలహారతి అనే నానుడి భక్తుల్లో నాటుకుపోయింది. తెలుగుచరిత్రలో తొలి తెలుగు కవయిత్రి తరిగొండ శ్రీ వెంగమాంబ. ఆమె ప్రపంచానికి ఓ సాహితీ వేత్తగానే కాకుండా అప్పటి సాంఘిక దురాచారాలు, సనాతన ధర్మాలను ధైర్యంగా ఎదిరించింది. వెంగమాంబ జయంతి ఉత్సవాలు తరిగొండ, తిరుమలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
17వ శతాబ్దంలో జననం
క్రీ.శ 17వ శతాబ్దంలో చిత్తూరు జిల్లా తరిగొండలో నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కానాడ కృష్ణమూర్తి, అచ్చమాంబ దంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని తన భర్తగా భావించి నిరంతరం అద్వితీయమైన ధ్యానముద్రలో గడిపేది.
ఎన్నో రచనలకు శ్రీకారం
శ్రీ వెంకటేశ్వరస్వామిపై అనురక్తితో అనేక రచనలకు శ్రీకారం చుట్టారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్మరిస్తూ శ్రీ నరసింహ శతకం రచించింది. దీ నికి నిదర్శనంగా ఇప్పటికీ తరిగొండలో శ్రీ లక్ష్మీనరసిం హస్వామి ఆలయంలోనే శ్రీ వెంగమాంబ ఆలయం ఉంది. శ్రీకృష్ణపారిజాతం, ముక్తకాంతావిలాసం, శ్రీ ముద్రరామాయణ ద్విపద కావ్యాలను రచించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి మీద సుమారు రెండు వేల కీ ర్తనలను తాళ పత్రాలపై రచించింది. ఈ తాళపత్రాలు నేటికీ తిరుమలలో టీటీడీ ఆధీనంలో ఉన్నాయి.
సాంఘిక దురాచారాలను
ధిక్కరించిన ధీరవనిత
క్రీ.శ 17,18 శతాబ్దాల్లో సమాజంలో సాంఘిక దురాచారాలను కట్టుదిట్టంగా అమలు చేసేవారు. తిరుపతి సమీపంలోని భాకరాపేటకు చెందిన ఇంజేటి వెంకటాచలపతితో వెంగమాంబ వివాహం జరిపించారు. అయితే దురదృష్టవశాత్తు భర్త ఆమె చిన్నతనంలోనే గతించారు. బ్రాహ్మణ సమాజంలో సనాతన సంప్రదాయాలు ఎక్కువగా పాటించేకాలం. బ్రాహ్మణ సీ్త్రకి భర్త మరణిస్తే శిరోముండనం చేయించి బొట్టు, గాజు, మెట్టలు తొలగించి ఇంటిలోనే ఉంచేవారు. అయితే శ్రీనివాసుడినే తన భర్తగా భావించిన వెంగమాంబ ఈ సంప్రదాయాలను తిరస్కరించింది. ఈమె ధోరణిని నిరసిస్తూ బ్రాహ్మణులంతా పుష్పగిరి పీఠాధిపతి విద్యానృసింహా భారతికి ఫిర్యాదు చేశారు.
గురుపీఠం దగ్ధం.. శిరోజాలు యథాతథం
పుష్పగిరి పీఠాధిపతి తరిగొండకు చేరుకొని వెంగమాంబకు హితబోధ చేశారు. ఆమె తిరస్కరించడంతో అపరాధంగా భావించిన పెద్దలు.. పీఠాధిపతికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పు సరిదిద్దుకోవాలని ఆదేశించారు. అయితే వెంగమాంబ పీఠాధిపతికి బదులుగా గురుపీఠానికి నమస్కారం చేయడంతో గురుపీఠం దగ్ధమైంది. ఆగ్రహించిన పెద్దలు ఆమెకు బలవంతంగా శిరోముండనం చేయించి తరిగొండ నరసింహస్వామి కొలనులో స్నానం చేయించారు. సాన్నం చేసిన తరువాత వెంగమాంబ తలపై శిరోజాలు మునపటి లాగే దర్శనమిచ్చాయి. దీంతో వెంగమాంబకు గ్రామ బహిష్కారం విధించారు.
ముస్లిం మతపెద్ద మురాషావలీ ఆశ్రయం
గ్రామ బహిష్కారానికి గురైన శ్రీ వెంగమాంబకు తరిగొండలో అప్పటి గొప్ప సూఫీమత బోధకుడు ముస్లిం మతగురువైన హజరత్ సయ్యద్ మురాద్‌షావలీ ఆశ్రయం కల్పించారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉంది. తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే ఈ మురాద్‌వలీ దర్గా(సమాధి) ఉంది. ఏటా ఇక్కడ వెంగమాంబ ఉత్సవాల కంటే మునుపే దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం వెంగమాంబ తరిగొండకు సమీపంలోని మారెళ్ల గెవి(గుహ)కు చేరుకుంది. అయితే ప్రతి రోజు ఆమె సాధనకు అవసరమైన సాధన సామగ్రి, కందమూలాలను మురాద్‌షావలే సమకూర్చేవారు.
ఆంజనేయస్వామి గుహ నుంచే తిరుమలకు..
బ్రాహ్మణ పెద్దల ప్రవర్తనతో మనస్తాపం చెందిన వెంగమాంబకు శ్రీనివాసుడు తన వద్దకు చేరుకోవాలని సూచించి తిరుమలకు మార్గం కూడా చూపించారు. ప్రస్తుతం తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం వెనకవైపు ఉన్న సొరంగ మార్గం గుండా ఆమె తిరుమలకు చేరుకున్నారు. అక్కడ తుంబుర తీర్థంలోని శ్రీ వెంగమాంబ గుహగా పిలువబడే పర్వతశ్రేణిలో తన సాధన కొనసాగించింది. అక్కడే కొన్ని రచనలు, కీర్తనలు రచించింది.
ముత్యాల హారతి.. వెంకటేశ్వరుడికి జోలపాట
తిరుమలలోనూ బ్రాహ్మణుల నుంచి ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. ఒకరోజు వెంగమాంబ గుహలో శ్రీనివాసుడు అంతర్థానమె(ప్రత్యక్షమై) ఉండటం బ్రాహ్మణులు వీక్షించి వెంగమాంబ మహత్యాన్ని తెలుసుకొని తమ తప్పులు క్షమించాలని వేడుకొన్నారు. అప్పటి నుంచి కొండపైన అన్నయమ్య వారసులకు కల్పించిన సౌకర్యాలను ఈమెకు కల్పించారు. ఉండడానికి నివాసం, ఇతర సౌకర్యాలతోపాటు ఆలయంలో ఉదయం అన్నమయ్య మేలుకొలుపు తరువాత రాత్రి స్వామి వారి జోలపాట ముత్యాలహారతి ఇచ్చే భాగ్యాన్ని వెంగమాంబకు కల్పించారు. అప్పటి నుంచి ఆమె తరువాత ఆమె వంశీకులు నేటికి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
నిత్యాన్నదానానికి శ్రీకారం
తిరుమలలో నేటికి కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తరిగొండ శ్రీ వెంగమాంబే. క్రీ.శ 1812–15 మధ్య కాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ తన నివాసంలోనే భోజనాలు తయారు చేసి వడ్డించడం ప్రారంభించింది. వందలాది మంది భక్తుల ఆకలిని ప్రతి రోజూ తీర్చేది. టీటీడీ వారు నేటికి ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. రోజూ కొండపై వేలాది మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయ సమీపంలోని నిత్యాన్నదాన సత్రానికి శ్రీ వెంగమాంబ పేరు పెట్టడం.
రెండు రోజుల పాటు జయంతి ఉత్సవాలు
మండలంలోని తరిగొండ ఆలయంతోపాటు తిరుమలలో శ్రీ వెంగమాంబ జయంతి ఉత్సవాలు బుధవారం అంకురార్పణతో ప్రారంభం అవుతాయి. గురువారం తరిగొండలోని వెంగమాంబ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు స్నపన తిరుమంజనం, 11 గంటలకు పుష్పాంజలి, సాయంత్రం ఆరు గంటలకు గోష్టిగానం, 7 గంటలకు హరికథా వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరుపతి శ్రీ వెంగమాంబ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శ్రీ వెంగమాంబ విగ్రహం
తరిగొండలో శ్రీ వెంగమాంబ ఆలయం


