ప్రజా సమస్యలను పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలను పరిష్కరించండి

Apr 7 2026 8:01 AM | Updated on Apr 7 2026 8:01 AM

మదనపల్లెఅర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణశర్మ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు. సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాల్సిన బాధ్యత అఽధికారులపై ఉందన్నారు. అలాగే లక్ష్యాలను చేరుకోవాలంటూ జేసీ పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా మొత్తం 388 అర్జీలు స్వీకరించినట్లు జేసీ పేర్కొన్నారు. సబ్‌కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఎస్‌డీసీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, సర్వేశాఖ ఏడీ భరత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

తమ కాలనీకి వెళ్లే రోడ్డును శ్రీదేవి, నరసయ్య అనే దంపతులు వారి అనుచరులతో కలసి జేసీబీతో ధ్వంసం చేసి ఆక్రమణకు యత్నించారని మదనపల్లె మండలం కొండామర్రిపల్లె పంచాయతీ టీఎన్‌ఆర్‌కాలనీ వాసులు అర్జీ సమర్పించారు. ప్రశ్నించిన స్థానికులను చంపుతామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. పోలీసులు ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ గొడవ చేసే వారిపై కేసులు పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని దారి సౌకర్యం కల్పించాలంటూ స్థానికులు అర్జీలో పేర్కొన్నారు.

● కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన నాయిబ్రాహ్మణులు అర్జీ సమర్పించారు. కడపకు చెందిన ఓ వ్యక్తి తమ షాపులపై కన్నేశాడన్నారు. చిన్న షాపులను తొలగించి, అక్కడ కార్పొరేట్‌ తరహాలో పెద్ద సెలూన్‌ ప్లాజా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. ఇదే జరిగితే తామంతా రోడ్డునపడతామన్నారు. ముఖ్యంగా 50 కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి షాపుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటూ కార్మికులు కోరారు.

● తమ రెండో కుమారుడికి కాళ్లుచేతులు, శరీర అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో ఆర్థిక పరిస్థితికి మించి వైద్యం చేయిస్తున్నామని మదనపల్లె పట్టణానికి చెందిన గాయత్రి అర్జీ సమర్పించారు. అప్పులు భారమై చికిత్స చేయించలేకపోతున్నామని, తన బిడ్డకు ఉచిత వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలంటూ జేసీకి విన్నవించారు.

జేసీ శివ్‌నారాయణశర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement