యమలా సుదర్శన్
మదనపల్లెఅర్బన్: దళితులను అణగదొక్కడానికే కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శన్ ఆరోపించారు. బుధవారం స్థానిక మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు క్రైస్తవ మతంలోకి చేరితే కులం మారుతుందని న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ప్రకటించడం అన్యాయమన్నారు. ఇవన్నీ దళితుల మధ్య చిచ్చుపెట్టే మాటలన్నారు. ఇలాగైతే కులవ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించకుండా బీజేపీ చెప్పినట్లు చట్టాలను అమలు చేయడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు. దళితులను అణగదొక్కుతూ..చిచ్చుపెడుతున్న ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహానాడు నాయకులు మాణిక్యం, చంద్రయ్య, గుండా మనోహర్, నటరాజు, శ్రీనివాసులు, రమణ, తదితరులు పాల్గొన్నారు.


