రికార్డులు ఉన్నట్టా.. లేనట్టా! | - | Sakshi
Sakshi News home page

రికార్డులు ఉన్నట్టా.. లేనట్టా!

Apr 1 2026 7:36 AM | Updated on Apr 1 2026 7:36 AM

పెద్దతిప్పసముద్రం : స్థానిక గ్రామ సచివాలయంలో రూ.లక్షల నిధులకు సంబంధించి రికార్డులు, బిల్‌ బుక్కులు ఉన్నాయా లేవా అని విచారణ అధికారుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈవోఆర్డీ ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మదనపల్లి డీఎల్పీవో నాగరాజు 10 రోజుల వ్యవధిలోనే మూడు సార్లు స్థానిక సచివాలయానికి వచ్చి రికార్డులు పరిశీలించారు. గత మూడేళ్ల వ్యవధిలో పంచాయతీకి వివిధ పన్నుల రూపంలో వచ్చిన నిధులకు సంబంధించి రికార్డులు లేనందున, ఇక్కడ పంచాయతీ కార్యదర్శులుగా పని చేసిన ముగ్గురికి సంజాయిషీ కోరుతూ మెమోలు సైతం జారీ చేశారు. ఈ తరుణంలో మంగళవారం ఇక్కడికి వచ్చిన డీఎల్పీవో వారపు సంత, జంతు వధశాల, బస్టాండ్‌ గేటు వసూళ్ల కోసం బహిరంగ వేలంలో దక్కించుకున్న హెచ్చు పాటాదారులను పిలిపించారు. సదరు హెచ్చు పాటాదారులకు కార్యదర్శులు రశీదులు ఇచ్చారా, ఇచ్చి ఉంటే రికార్డుల్లో నమోదైన డబ్బుకు, రశీదుల్లో వ్యత్యాసం ఉందా, సదరు డబ్బు ప్రభుత్వ ఖజానాకు జమ చేశారా అని ఆరా తీస్తున్నారు. అదే విధంగా ఇంటి, నీటి పన్ను వసూలు చేసిన వారితోపాటు పక్కా గృహాల అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించి వారు ఎంత సొమ్ము చెల్లించారు, ఆన్‌లైన్‌ రశీదులు ఇచ్చారా లేదా అని అధికారులు లోతుగా విశ్లేషిస్తూ విచారణ చేపడుతున్నారు. వారం, పది రోజుల్లో రికార్డుల తనిఖీ, పక్కదారి పట్టిన నిధుల వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడికి గాయాలు

సదుం : రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడ్డ సంఘటన మండలంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పీలేరు మండలం రేగళ్లు పంచాయతీ బోయపల్లెకి చెందిన రాజేశ్‌ రెడ్డివారిపల్లె బస్‌స్టాప్‌ సమీపంలో బైక్‌ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు పక్కన బైక్‌తోపాటు పడిపోయి ఉండగా స్థానికులు గుర్తించారు. రోడ్డు పక్కన పడిపోవడంతో ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తరువాత గమనించారు. 108లో అతనిని స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పీలేరుకు తీసుకుపోయారు. అతనే అదుపుతప్పి పడ్డాడా.. లేక ఏదైనా వాహనం ఢీకొందా అన్న విషయం తెలియరాలేదు.

తల్లీకూతురు ఆత్మహత్య

తొండూరు : తొండూరు మండల పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మల్లేల గ్రామంలో మంగళవారం రాత్రి 7.45 గంటలకు షేక్‌ బీబీ (56), ఆమె కుమార్తె షేక్‌ ఇమామ్‌బీ (33)లు తమ ఇంటిలోని ఫ్యాన్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి షేక్‌ ఇమామ్‌బాషా ఇంటిలో కనిపించకుండా పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పుల బాధతోనే తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement